Breaking News

రక్తదానం అన్ని దానాలకంటే గొప్పది : సీఎం ప్రత్యేక కార్యదర్శి ప్రద్యుమ్న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్‌టీఆర్ జిల్లా బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ప్రద్యుమ్న స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్‌టీఆర్ జిల్లా కమిటీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో ఆదర్శవంతంగా ఉన్నాయని ప్రశంసించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిరంతరం చేపడుతూ జిల్లా కమిటీ ప్రత్యేక గుర్తింపు పొందుతోందన్నారు. కమిటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను చూసి ప్రభావితుడినై తాను స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసినట్లు తెలిపారు. రక్తదానం అన్ని దానాలకంటే గొప్పదని, ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే శక్తి రక్తదాతలకే ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్‌టీఆర్ జిల్లా కమిటీ చైర్మన్ డాక్టర్ జి. సమరం మాట్లాడుతూ రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. అత్యవసర సమయాల్లో రక్త కొరత లేకుండా ఉండేందుకు యువత పెద్ద సంఖ్యలో రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. సమాజ సేవే రెడ్ క్రాస్ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

వైస్ చైర్మన్ డాక్టర్ వెలగా జోషి మాట్లాడుతూ రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెడ్ క్రాస్ తరచూ శిబిరాలు నిర్వహిస్తోందన్నారు. సీఎం ప్రత్యేక కార్యదర్శి ప్రద్యుమ్న స్వయంగా రక్తదానం చేయడం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఏడాదికి కనీసం ఒకసారి రక్తదానం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *