గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జాతీయ రహదారి వెంబడి ఉన్న సర్వీస్ రోడ్లను నిరంతరం స్వచ్ఛంగా, అందంగా తీర్చిదిద్దేందుకు జిఎంసి ప్రత్యేక చర్యలు చేపడుతోందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. నగర పరిధిలోని కాకాని రోడ్ వై జంక్షన్ నుండి చిలకలూరిపేట రోడ్ వై జంక్షన్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న సుమారు 32 కిలోమీటర్ల పొడవైన సర్వీస్ రోడ్లను నిత్యం శుభ్రంగా ఉంచేందుకు ఒక క్రమబద్ధమైన ప్రణాళికను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రహదారికి ఇరుపక్కలా పిచ్చి మొక్కలు పెరగకుండా నివారించడంతో పాటు, అక్కడ పేరుకుపోయిన పాత వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఈ ప్రత్యేక పారిశుధ్య పనులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి 60 మంది పారిశుధ్య కార్మికులతో కూడిన ఒక ప్రత్యేక బృందాన్నిఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ బృందం ప్రతిరోజూ సర్వీస్ రోడ్ల వెంబడి పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం, రోడ్డు పక్కన చేరిన మట్టి కుప్పలను తొలగిస్తూ రహదారులను శుభ్రపరుస్తోందన్నారు. సదరు పారిశుధ్య పనులను ప్రాంతాల వారీగా పర్యవేక్షణకు 6 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లకు విధులు కేటాయించామని తెలిపారు. ప్రజలు, ప్రయాణికుల సహకారం లేనిదే సర్వీస్ రోడ్ల సంపూర్ణ స్వచ్ఛత సాధ్యం కాదని, నగరంలోకి వచ్చే ప్రధాన రహదారులు, సర్వీస్ రోడ్లపై ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు, పాడుబడిన వస్తువులను విసిరేయవద్దని కోరారు. ముఖ్యంగా రహదారి పక్కన ఉన్న హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థల నిర్వాహకులు తమ దుకాణాల వ్యర్థాలను రోడ్లపై వేయకుండా చెత్త సేకరణ వాహనాలకే అందించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై చెత్త వేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Prajavartha Online Telugu News