Breaking News

ప్రపంచంలోనే తొలి ఉచిత ఏఐ ట్రైనింగ్ సెంటర్ గన్నవరంలో ప్రారంభం

-కేసరపల్లి స్వర్ణ గ్రామంలో యువ కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-పి4 పథకంలో భాగంగా హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రం ఏర్పాటు
-గన్నవరం యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలే లక్ష్యం: యార్లగడ్డ వెంకట్రావు
-మూడు నెలల ఉచిత ఏఐ శిక్షణతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి: ఎమ్మెల్యే
-ఏఐ విప్లవంలో గన్నవరం యువత ముందుండాలని పిలుపు
-ప్రపంచవ్యాప్తంగా ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది : యార్లగడ్డ
-హెచ్‌సీఎల్ ఫౌండేషన్‌తో కలిసి యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాం: ఎమ్మెల్యే
-గన్నవరం నుంచి ప్రపంచ స్థాయి ఐటీ ఉద్యోగాలకు యువతను సిద్ధం చేయడమే లక్ష్యం: యార్లగడ్డ
-సీ-డాక్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నాం: యార్లగడ్డ
-నైపుణ్యాభివృద్ధే యువత భవిష్యత్తును మార్చే ఆయుధం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచంలోనే తొలి ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) శిక్షణా కేంద్రాన్ని గన్నవరం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం యువత భవిష్యత్తును మార్చే చారిత్రక అడుగని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. పి4 కార్యక్రమంలో భాగంగా హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ESSCI) సహకారంతో కేసరపల్లి స్వర్ణ గ్రామంలోని యువ కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం తరగతి గదులు, ల్యాబ్‌లు పరిశీలించి, శిక్షణా విధానం, కోర్సుల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్వర్ణ గ్రామం భవనాన్ని అభివృద్ధి చేసి హెచ్‌సీఎల్ ఫౌండేషన్‌కు అప్పగించామని తెలిపారు. సుమారు రూ.కోటి వ్యయంతో కేంద్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు, ప్రతి ఏడాది రూ.80 లక్షలు నిర్వహణ కోసం హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ఖర్చు చేయనుందని చెప్పారు. ఇప్పటికే 619 మంది యువత దరఖాస్తు చేసుకున్నారని, మరింత మందికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. పి4 కార్యక్రమం కింద ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకోవడం కంటే, వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఉపాధి కల్పించడమే నిజమైన సంక్షేమమనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. హెచ్‌సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ రాజ్ నాడార్ సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా 2.26 లక్షల మంది ఉద్యోగులు ఉన్న హెచ్‌సీఎల్ సంస్థకు గన్నవరంలో 28 ఎకరాలు కేటాయించగా, ఇప్పటికే 5,500 మందికి ఉద్యోగాలు కల్పించిందన్నారు. హెచ్‌సీఎల్ ప్రపంచ కేంద్రాల్లో గన్నవరం ప్రస్తుతం మూడో అతిపెద్ద కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. మొదట బీటెక్, బీఎస్సీ, బీకాం కంప్యూటర్ విద్యార్థులకు మాత్రమే ఏఐ-ఎంఎల్ శిక్షణ ఇవ్వాలని భావించినా, అనంతరం ఈసీఈ విద్యార్థులకు సెమీకండక్టర్స్, చిప్ డిజైనింగ్ కోర్సులు, మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ కూడా అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోనే తొలిసారి ఉచితంగా ఏఐ-ఎంఎల్ శిక్షణ అందిస్తున్న కేంద్రం ఇదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సాధారణంగా ఈ కోర్సులకు బయట రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తారని, కానీ గన్నవరం యువత కోసం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా గ్రామీణ యువతలో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించేందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ-ఎంఎల్ రంగానికి విపరీతమైన డిమాండ్ ఉందని, 90 రోజుల శిక్షణ పూర్తి చేసి కష్టపడి నేర్చుకుంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ వంటి సంస్థల్లో అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఒక సంవత్సరం అనుభవం వచ్చిన తర్వాత భారీ వేతనాలతో ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయని, భవిష్యత్తులో రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వార్షిక వేతనం పొందినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. తాను ఐటీ రంగంలో మూడు దశాబ్దాల అనుభవంతోనే ఈ మాట చెబుతున్నానని, ఏఐ-ఎంఎల్ భవిష్యత్తును మార్చే రంగం అని స్పష్టం చేశారు. ఈ కేంద్రం గన్నవరం యువత జీవితాలను మార్చే ‘గేమ్‌ ఛేంజర్’ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గన్నవరం నియోజకవర్గంలో 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యమని, ఇప్పటికే సుమారు 7 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా గన్నవరం అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఐటీ రంగాన్ని విస్తరించే దిశగా గూగుల్ వంటి సంస్థలను తీసుకొస్తున్న మంత్రి నారా లోకేశ్ కృషిని ప్రశంసించారు. రాబోయే పదేళ్లలో విశాఖపట్నం హైదరాబాద్‌ను మించిన ఐటీ కేంద్రంగా అవతరిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ ఆంధ్ర పి4 ఫౌండేషన్ వైస్ చైర్‌ పర్సన్ చెరుకూరి కుటుంబరావు, హెచ్‌సీఎల్ టెక్ విజయవాడ ఏవీపీ & లొకేషన్ హెడ్ శివప్రసాద్, ESSCI వైస్ ప్రెసిడెంట్ సరోజ్ అపాటో, హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ప్రతినిధులు గౌరవ్ మజుమ్దార్, జోషువా, మహేందర్ కసులా, గన్నవరం అసెంబ్లీ స్పెషల్ ఆఫీసర్ షేక్ షాహిద్ బాబు, నియోజకవర్గ యంగ్ ప్రొఫెషనల్ రాజేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *