-కృష్ణా డెల్టా నీటి పరిస్థితిపై ఇరిగేషన్ ఈఎన్సీ కే. నరసింహమూర్తి వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గాయని ఇరిగేషన్ శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) కే. నరసింహమూర్తి తెలిపారు.
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, కృష్ణా నదిలో ప్రస్తుత నీటి లభ్యత, కృష్ణా డెల్టాకు సాగు, త్రాగు నీటి సరఫరాపై ఇరిగేషన్ శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) కే. నరసింహమూర్తి, ఇరిగేషన్ శాఖ సీఈ బి. రాంబాబు, ఎస్ఈ జే. గుణకర్ లతో కలిసి శుక్రవారం ఇరిగేషన్ కాంపౌండ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రస్తుత నీటి లభ్యత పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) కే. నరసింహమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సాధారణం కంటే 51 శాతం, కృష్ణా డెల్టా పరిధిలో 49 శాతం వర్షపాతం లోటు నమోదైందన్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల్లో సుమారు 50 టీఎంసీలు, తుంగభద్రలో మరో 70 టీఎంసీల కుషన్ (ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తక్కువ) ఉండటంతో అవి నిండితేనే శ్రీశైలానికి నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కూడా కుషన్ నింపిన తర్వాతే దిగువ ప్రాంతాలకు నీటి విడుదల సాధ్యమవుతుందని చెప్పారు.
ప్రభుత్వం 2027 జూన్ వరకు గ్రామాలు, పట్టణాలు, మున్సిపాలిటీల త్రాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణ చేపడుతోందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో ఉన్నా వినియోగించదగిన నీటిని కూడా త్రాగునీటి అవసరాల కోసమే భద్రపరిచామని వెల్లడించారు. ప్రస్తుతం పట్టిసీమ ద్వారా ఆర్‌ఎంసీ కాల్వకు నీటిని విడుదల చేస్తున్నప్పటికీ, గోదావరి నదిలో ప్రవాహాలు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణలో వర్షాభావం కారణంగా ఎగువ జలాశయాలు పూర్తిగా నిండలేదని, సీలేరు ద్వారా వచ్చే నీటి లభ్యత కూడా తగ్గిందన్నారు. సాధారణంగా 100 నుంచి 125 రోజుల పాటు ఉండే గోదావరి ప్రవాహం ఈసారి 60 నుంచి 70 రోజులకే పరిమితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కృష్ణా డెల్టా సాగుకు సుమారు 150 టీఎంసీల నీరు అవసరమైనప్పటికీ, ప్రస్తుతం అంత నీటి లభ్యత లేదన్నారు. పట్టిసీమ పంపింగ్‌లో కూడా ప్రవాహం తగ్గడంతో అన్ని పంపులను ఒకేసారి నడపడం సాధ్యం కావడం లేదని వివరించారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని సుమారు 60 లక్షల మంది ప్రజల త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందువల్ల కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్న నీటిని త్రాగునీటి అవసరాలకే వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎంసీ కాల్వ నుంచి అనధికారికంగా పంపులు ఏర్పాటు చేసి నీటిని తీసుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, ఈ చర్యలతో అనధికారిక పంపుల వినియోగం కొంత మేర తగ్గిందన్నారు.
ప్రస్తుతం నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆర్‌ఎంసీ పరిధిలో వరి సాగు కాకుండా వేరే పంటలపై ధృట్టి పెడితే బాగుంటుందేమో చూడాలని రైతులకు సూచించారు. ఇప్పుడు వరి నాటితే మధ్యలో నీరు అందక రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీటి ప్రవాహాలు పెరిగితే వ్యవసాయ శాఖతో చర్చించి పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడించారు.
ప్రస్తుత అసాధారణ పరిస్థితులను రైతులు అర్థం చేసుకుని విజ్ఞతతో వ్యవహరించాలని, ప్రభుత్వానికి సహకరించాలని ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు. త్రాగునీటి అవసరాలు పూర్తిగా తీర్చిన తర్వాతే మిగిలిన నీటిని ఆరుతడి పంటలకు వినియోగించే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
సర్ ఆర్ధర్ కాటన్ వర్ధంతి సదర్భంగా ఘన నివాళి:
సర్ ఆర్ధర్ కాటన్ వర్ధంతి సందర్భంగా ఇరిగేషన్ కాంపౌండ్ లో గల ఆయన విగ్రహానికి ఈఎన్సీ కే. నరసింహ మూర్తి ఆధ్వర్యంలో పూలమాలలు అర్పించారు.
Prajavartha Online Telugu News