– విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యం కీలకం
– ప్రభుత్వ బడులు.. విలువుల విద్యకు, విజ్ఞానానికి నెలవులు
– స్పష్టమైన విద్యా లక్ష్యాల సాధనకు పటిష్ట కార్యాచరణ
– సమగ్ర మౌలిక వసతులతో డిజిటల్ టూల్స్‌తో విద్యాఫలాలు
– ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) విద్యార్థుల విద్యా ప్రగతి, సమగ్రాభివృద్ధికి తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి పాఠశాల, సమాజం కలిసి పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయనే దార్శనికతకు అనుగుణంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం జగ్గయ్యపేటలోని గెంటేల వెంకట జోగయ్య జెడ్‌పీ ఉన్నతపాఠశాలలో జరిగిన మెగా పీటీఎం 4.0లో కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్.. ఆర్‌డీవో జి.అనిల్ కుమార్, డీఈవో ఎల్.చంద్రకళ, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. 723 మంది విద్యార్థులు గల పాఠశాలలో విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి ఆయా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం సైన్స్, మ్యాథమెటిక్స్ ల్యాబ్‌లను పరిశీలించారు. దాదాపు 9,000 పుస్తకాలకు నెలవైన పాఠశాల గ్రంథాలయం, క్రీడా సామగ్రి ప్రదర్శనను పరిశీలించిన అనంతరం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సెల్ఫీస్టాండ్ వద్ద ఫొటోలు దిగి మొక్కలు నాటారు. విద్యార్థుల తల్లిదండ్రులకు నిర్వహించి టగ్ ఆఫ్ వార్, రంగవల్లుల పోటీలను పరిశీలించారు. అనంతరం జరిగిన ఆత్మీయ సభా కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం విజయవంతంగా జరుగుతున్నాయని.. విద్యార్థుల ప్రగతిని 360 డిగ్రీల కోణంలో పరిశీలించి.. లోటుపాట్లు ఏవైనా ఉంటే సరిదిద్ది అత్యుత్తమ విద్యా ఫలితాలు రాబట్టేందుకు ఈ కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు, పథకాల అమలుపై తల్లిదండ్రుల సూచనలు తీసుకునేందుకు ఇవి మంచి వేదికలుగా నిలుస్తున్నాయన్నారు. అదేవిధంగా తమ పిల్లలు చదువుకుంటున్న పాఠశాల వాతావరణాన్ని తల్లిదండ్రులకు పరిచయం చేసేందుకు కూడా ఉపయోగపడతాయన్నారు. విద్యకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపైనా చర్చించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రయోజనకారిగా ఉంటున్నాయని వివరించారు. ప్రభుత్వ కృషికారణంగా పదో తరగతి, ఇంటర్‌లో మంచి ఫలితాలు వస్తున్నాయని.. దాదాపు 5 వేల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు రావడం ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన విషయమన్నారు. విద్యార్థుల హాజరుతో పాటు మార్కులు తదితర వివరాలను తమ మొబైళ్లలోనే తల్లిదండ్రులు తెలుసుకునేందుకు లీప్ యాప్ డిజిటల్ వేదిక ఉపయోగపడుతోందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
విజ్ఞాన వేదికలుగా ప్రభుత్వ బడులు: ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
గౌరవ సీఎం, గౌరవ విద్యాశాఖ మంత్రి కృషి ఫలితంగా ప్రభుత్వ బడులు విలువలతో కూడిన విద్యను అందిస్తూ విజ్ఞానాన్ని అందిస్తున్నాయని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ అన్నారు. చేస్తూ నేర్చుకునేందుకు వీలుగా పాఠశాలల్లో ల్యాబ్‌లు, వొకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉంటున్నాయన్నారు. భవిష్యత్తులో వారి కాళ్లపై వారు నిలబడేలా పాఠశాలల్లో నైపుణ్యాలు అందుతున్నాయని వివరించారు. విద్యార్థుల విజయానికి తల్లిదండ్రుల సహకారం అత్యంత కీలకమని.. పిల్లల చదువుపై నిరంతర శ్రద్ధ చూపడంతో పాటు పాఠశాల కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. మెగా పీటీఎం.. విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, అభ్యాస ఫలితాలు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు, లీప్ యాప్ వినియోగం, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) పురోగతి, పాఠశాల అభివృద్ధి చర్యలపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు విస్తృతంగా చర్చించేందుకు, విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు దోహదం చేస్తోందని వివరించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న తల్లికి వందనం వంటి పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు బాగా చదువుకొని కెరీర్ పరంగా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీవీ నాగేశ్వరరావు, పేరెంట్స్ కమిటీ ఛైర్‌పర్సన్ ఎస్.మేరి, తహసీల్దార్ ఎస్.శిరీష, పీసీ ఎక్స్ అఫీషియో మెంబర్ కర్లపాటి శ్రీనివాసరావు, ఎంఈవో చిట్టి బాబు, వార్డు కౌన్సిలర్ గీతా రాణి, అసిస్టెంట్ ఏఎంవో శిరీషా రాణి, విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News