Breaking News

యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో – కాన్క్లేవ్ 4.0

-విజయవాడ ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా ప్రారంభం
-పరిశ్రమల స్థాపనతో పాటు బ్రాండింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్‌కు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి
-జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ.
-ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
-ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడే లక్ష్యంతో బీఎన్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో – కాన్క్లేవ్ 4.0 శుక్రవారం విజయవాడలోని ఎస్.ఎస్. కన్వెన్షన్ హాల్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ఎక్స్‌పోను ప్రారంభించారు. వివిధ పరిశ్రమల స్టాల్స్ పరిశీలించిన అతిథులు ఎక్స్‌పో ప్రారంభానంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే వివిధ పరిశ్రమలు, స్టార్టప్ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి పరిశీలించారు. ఆయా సంస్థల ప్రతినిధులతో మాట్లాడి ఉత్పత్తుల తయారీ విధానం, బ్రాండింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ వ్యూహాలు, వినూత్న ఆవిష్కరణలు, వ్యాపార విస్తరణ అవకాశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లే అవకాశాలపై ప్రత్యేకంగా ఆసక్తి కనబరిచారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ మాట్లాడుతూ, ఇటువంటి ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పోలు యువతలో వ్యాపార స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. వివిధ కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులు, యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార నమూనాలు ఒకే వేదికపై అందుబాటులో ఉండటం వల్ల పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు అవసరమైన సమాచారం సులభంగా లభిస్తుందని తెలిపారు. పరిశ్రమ స్థాపనలో పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం ఎంత ముఖ్యమో, ఉత్పత్తికి బ్రాండింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కూడా అంతే కీలకమని పేర్కొన్నారు. సమర్థవంతమైన మార్కెటింగ్ ద్వారానే వ్యాపారాన్ని విస్తరించి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవచ్చన్నారు. జూలై 24, 25, 26 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఎక్స్‌పోను విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటువంటి వేదికలు కొత్త ఆలోచనలకు, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడతాయని పేర్కొంటూ యువత పెద్ద సంఖ్యలో సందర్శించాలని పిలుపునిచ్చారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ, ఏ దేశమైనా వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని, స్టార్టప్‌లు, చిన్నతరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని కోరారు.

ఎక్స్‌పో నిర్వాహకులు మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ప్రోత్సాహం, వ్యాపార అవకాశాలు, మార్కెట్ అనుసంధానం కల్పించడమే ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. కాన్క్లేవ్ 4.0లో తయారీ, సేవారంగం, ఆహార ఉత్పత్తులు, యంత్రాలు, సాంకేతికత, ఫైనాన్స్, మార్కెటింగ్, బ్రాండింగ్, డిజిటల్ సేవలు తదితర రంగాలకు చెందిన అనేక సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తున్నాయన్నారు. వ్యాపార భాగస్వామ్యాలు, పెట్టుబడి అవకాశాలు, మార్కెట్ విస్తరణ, నెట్‌వర్కింగ్‌కు ఈ ఎక్స్‌పో వేదికగా నిలుస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏఎంవి నాంచారరావు, బీఎన్‌ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జై దేశాయ్, విశాల్ దేశాయ్, ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో చైర్మన్ త్రినాధ్ నండూరి, కాన్క్లేవ్ చైర్మన్ యువ కిషోర్, కన్వీనర్ దేవకుమార్, సెక్రటరీ కె. లక్ష్మీ శాంతి, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *