Breaking News

తెలంగాణ ఆర్టీసీ ఎన్నికల్లో ఇ.యు. ఘన విజయం

-కార్మికుల విశ్వాసానికి నిదర్శనం: ఏపీ ఇ.యు. నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఇ.యు.) కూటమి సాధించిన ఘన విజయంపై ఏపీ పీటీడీ (ఆర్టీసీ) ఇ.యు. రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ ఇ.యు. నాయకత్వానికి అభినందనలు తెలిపారు.

అధికార బలం కంటే కార్మికుల విశ్వాసమే గొప్పదని ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయన్నారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసం నిజాయితీగా, నిబద్ధతతో పోరాడే సంఘాలకే కార్మికులు మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. ఇ.యు.కు రాష్ట్రస్థాయి గుర్తింపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. విజయానికి కృషి చేసిన రాష్ట్ర కమిటీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలను అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇ.యు. గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించడంలో కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ ప్రభుత్వ విలీన లక్ష్యాన్ని సాధించేందుకు నూతన నాయకత్వం కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ విజయం ఒక కార్మిక సంఘానికే పరిమితం కాదని, ఉద్యోగుల హక్కులు, ఉద్యోగ భద్రత, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం సాగుతున్న ఉద్యమాలకు లభించిన విజయమని పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీలో పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి, ఉద్యోగుల భద్రతకు, సంస్థ పరిరక్షణకు నూతన గుర్తింపు సంఘం కృషి చేయాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సంస్థల పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన కోసం ఏపీ, తెలంగాణ ఇ.యు.లు పరస్పర సహకారంతో పనిచేస్తాయని పలిశెట్టి దామోదరరావు, జి.వి. నరసయ్య స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …