Breaking News

సీఈసీని సాగనంపే వరకూ ఉద్యమిద్దాం, దసరా ఉత్సవాల తర్వాత భారీ నిరసన

-విజయవాడ పౌర సమాజం ఆధ్వర్యంలో ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
సామాన్య ప్రజల ఓటుహక్కుని హరిస్తున్న సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను బాధ్యతల నుంచి తొలగించే వరకూ ఉద్యమం ఆగదని విజయవాడ పౌర సమాజం ప్రతినిధి బూర్తి నగేశ్ హెచ్చరించారు. విజయవాడ ధర్నాచౌక్ లో నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. విజయవాడలో దసరా ఉత్సవాల కారణంగా ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదని భారీ నిరసనలను వాయిదా వేసినట్టు తెలిపారు. దసరా అనంతరం భారీ ఉద్యమం విజయవాడలో చేపట్టబోతున్నట్టు ఆయన తెలియజేశారు.

సోమవారం ఉదయం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, కాంగ్రెస్, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు. ధర్నానుద్దేశించి నగేశ్ మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న వైనం మీద భారతీయులందరూ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దిల్లీలో వేలాదిగా తరలివస్తున్న యువత ఉద్యమం తాకిడికి మోదీ ప్రభుత్వం కలవరపడుతోందన్నారు. అయినప్పటికీ నియంతృత్వ పోకడలతో ఆందోళనలు అణచివేయాలని చూడడం తగదని మండిపడ్డారు. ఓటు హక్కుని హరించే ఎస్ఐఆర్ ప్రక్రియ విరమించుకునే వరకూ ఉద్యమం ఆగదన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ని కాపాడేందుకు బీజేపీ ప్రయత్నం చేయడం చూస్తుంటే దేశంలో వ్యవస్థలను కాలరాస్తున్న వైనం స్పష్టమవుతోందన్నారు. ఆందోళనల కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్టుల మీద పోలీసుల దాడులను తీవ్రంగా నిరసించారు. దేశ స్వతంత్ర పోరాటం తరహాలో యువత సాగిస్తున్న ఉద్యమానికి దేశం యావత్తు సంఘీభావంగా నిలుస్తుందన్నారు.

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కే ఉమామహేశ్వర రావు, కాంగ్రెస్ నేత నరహారిశెట్టి నరసింహారావు తదితరులు మాట్లాడారు. మోదీ సర్కారుకి జనం తగిన రీతిలో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఉద్యమాలను అణచివేసి, ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు దేశం కదులుతుందన్నారు. మోదీకి మద్ధతుగా నిలుస్తున్న ఏపీ నేతలు కూడా సిగ్గుపడాలన్నారు. సర్ పేరుతో కోట్లాది మందిని ఓటు హక్కుకి దూరం చేయాలన్న కుట్రలు చెల్లుబాటుకావన్నారు. జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులను ఖండించారు. విజయవాడ పౌర సమాజం నిర్వహించే ఆందోళనకు తామంతా సంఘీభావంగా నిలుస్తామని తెలిపారు.

కార్యక్రమంలో విజయవాడ పౌర సమాజం ప్రతినిధులు వి. శంకర్, దాసరి శ్రీనివాస్, జర్నలిస్టులు బాబు, రాజు, నాగరాజు, శ్రీను, సీఐటీయూ నాయకుడు జ్యోతిబసు, కాంగ్రెస్ నేతలు అన్సారీ, బి. రమణ, కృషిద, బీవీ రమణ, ఇందిరా ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …