-రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో అవగాహన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
విపత్తుల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు ముందస్తు సంసిద్ధత, అప్రమత్తత ఎంతో అవసరమని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అన్నారు. అంతర్జాతీయ విపత్తుల ప్రమాద తగ్గింపు దినోత్సవం సందర్భంగా ఆయన అధ్యక్షతన కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో ఆహార ధాన్యాలు, తాగునీరు, అవసరమైన మందులు, టార్చ్లైట్లు, బ్యాటరీలు, రేడియో వంటి అత్యవసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కళాశాల, ఆసుపత్రిలో అగ్నిమాపక భద్రతా వ్యవస్థలపై విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు ప్రతి నెలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డా. వి.వి. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సంప్రదాయ ముందస్తు జాగ్రత్తలను కూడా ప్రతి కుటుంబం పాటించాలని సూచించారు. డా. సూర్యారావు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల వంటి భారీ జనసమ్మర్థ కార్యక్రమాలకు ముందుగానే విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు.
డా. సీతారామరాజు, డా. సురేంద్రబాబు, డా. పరాంకుశం, ప్రొఫెసర్ డా. శ్రీనివాసరెడ్డి, ప్రొఫెసర్ డా. శారద తదితరులు మాట్లాడుతూ, అగ్నిప్రమాదాలు, వరదలు, తుఫానులు వంటి విపత్కర పరిస్థితుల్లో భయాందోళనలకు గురికాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు. ప్రథమ చికిత్స, అగ్నిమాపక పరికరాల వినియోగం, ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు పోస్టర్ల ద్వారా అగ్నిప్రమాదాలు, వరదలు, తుఫానులు, విద్యుత్ ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కుటుంబ స్థాయిలో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవడం, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, అధికారిక హెచ్చరికలను పాటించడం వంటి అంశాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమాన్ని డా. ఎస్. ప్రశాంత్ కుమార్ సమన్వయపరిచారు. కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, వైద్య విద్యార్థులు, పరిశీలకులు, భద్రతా, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News