Breaking News

శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు

-రెండు తెలుగు రాష్ట్రాలకు శ్రీశైలం ప్రాజెక్టు గర్వకారణం
-ఇంజినీరింగ్ పటిష్ఠత, విద్యుత్ ఉత్పత్తి, బహుముఖ ప్రయోజనాలకు గుర్తింపు
-సీఎం చంద్రబాబు ముందుచూపుతో అందుబాటులోకి పట్టిసీమ ప్రాజెక్టు
-ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
శ్రీశైలం ప్రాజెక్టుకు వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. డ్యామ్‌ నిర్మాణ పటిష్ఠత, జలవిద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం, సాగు, తాగు నీటి అవసరాలకు అందిస్తున్న సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. శ్రీశైలం జలాశయం దశాబ్దాలుగా భారీ వరదలను తట్టుకుంటూ ప్రజలకు సేవలందిస్తోందని మంత్రి తెలిపారు. ఇది కేవలం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం మాత్రమే కాదని, లక్షలాది మంది తాగునీటి అవసరాలతో పాటు లక్షల ఎకరాల సాగునీటి అవసరాలను తీరుస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు అని వివరించారు. కృష్ణా జలాల వినియోగంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో విశేషమైన ప్రాధాన్యం కలిగి ఉందన్నారు.

పట్టిసీమతో రాయలసీమకు ప్రయోజనం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పట్టిసీమ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావడం వల్ల శ్రీశైలం జలాలను రాయలసీమ అవసరాలకు మరింత సమర్థంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడిందని గొట్టిపాటి పేర్కొన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఇప్పటివరకు సుమారు 500 టీఎంసీల నీటిని అందించడం వల్ల శ్రీశైలం జలాలను రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు వెసులుబాటు కలిగిందన్నారు. కృష్ణా డెల్టా రైతులకు అవసరమైన నీటిని అందిస్తూనే రాయలసీమ ప్రాంత అవసరాలకూ శ్రీశైలం జలాశయం అండగా నిలుస్తోందని తెలిపారు. అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థంగా వినియోగించడం, ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా నీటిని సద్వినియోగం చేయడంలో ముఖ్యమంత్రి ముందుచూపు స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …