-రోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త కేంద్రాల ఏర్పాటు
-పేదలకు ఉపశమనం-సేవల విస్తృతికి ప్రభుత్వ ప్రాధాన్యం
-2025-26లో డయాలసిస్ సేవలకు రూ.197.88 కోట్లు వ్యయం
-ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.90.09 కోట్ల విలువైన సేవలు
-వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మూత్రపిండాల(కిడ్నీ) వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం (పీఎంఎన్డీపీ) కింద కొత్తగా మరో 22 కేంద్రాలు త్వరలో ఏర్పాటు కాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రోగుల అవసరాలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో పిఎంఎన్డిపి కింద 61 కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. వీటికి అదనంగా కొత్తగా రానున్న 22 కేంద్రాల(మొత్తం 83) ద్వారా ఉచిత డయాలసిస్ (రక్తశుద్ధి) సేవలు పేదలకు మరింత చేరువ అవుతాయని వెల్లడించారు. ఇవి కాకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా 170 కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ రెండు పధకాల కింద ఉచితంగా అందించే డయాలసిస్ సేవల నిమిత్తం 2025-26లో రూ.197.88 కోట్లు వరకు వ్యయమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఇటీవలి వరకు రూ.90.09 కోట్ల విలువైన డయాలసిస్ సేవల్ని పేద రోగులు పొందారు.
కూటమి ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు 14 కొత్త కేంద్రాలు
ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం కింద రాష్ట్రంలో 2019కు ముందు 28 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 2019–24 మధ్య 19 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. 2024–25 నుంచి మరో 14 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా ఇప్పుడు 22 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో పలు కేంద్రాల ఏర్పాటులో న్యాయస్థానంలో విచారణ వంటి కారణాలతో జాప్యం జరిగింది. మొత్తం ఈ 22 కేంద్రాలను రోగులకు సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్క డయాలసిస్కు ప్రభుత్వం రూ.999 చొప్పున వ్యయం చేయనుంది. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒక్కో డయాలసిస్ సెషన్కు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు ఖర్చవుతుంది. రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి నెలకు నాలుగైదు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా రక్తశుద్ధి సేవలు అందుబాటులో ఉండటం బాధిత కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం కలిగిస్తుంది.
22 కేంద్రాలు.. ఎక్కడెక్కడంటే?
పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం ఏరియా ఆసుపత్రి, చిత్తూరు జిల్లాలో పీలేరు ఏరియా ఆసుపత్రి, వైఎస్సార్ కడప జిల్లాలో జమ్మలమడుగు ఏరియా ఆసుపత్రి, మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కొత్త డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా జిల్లాలో గన్నవరం సామాజిక ఆసుపత్రి, గుడివాడ ఏరియా ఆసుపత్రి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రాలు, బాపట్ల జిల్లాలో అద్దంకి, రేపల్లె సామాజిక ఆరోగ్య కేంద్రాలు, తిరుపతి జిల్లాలో రైల్వేకోడూరు, సత్యవేడు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రకాశం జిల్లాలో కొండెపి, తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, పల్నాడు జిల్లాలో వినుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రి, విజయనగరం జిల్లాలో బొబ్బిలి సామాజిక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నంద్యాల జిల్లాలో డోన్ ఏరియా ఆసుపత్రి, సున్నిపెంట సామాజిక ఆరోగ్య కేంద్రం, శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రం, మడకశిర ఏరియా ఆసుపత్రిలలో కొత్తగా డయాలసిస్ సేవల్ని అందించనున్నారు.
ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ మెషీన్లు
కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రతి కేంద్రంలో సుమారు రూ.85 లక్షల వ్యయంతో ఐదు డయాలసిస్ యంత్రాలు అందుబాటులోనికి వస్తాయి. వీటి ద్వారా రోజుకు 15 డయాలసిస్ సెషన్లు నిర్వహించే అవకాశం ఉంటుంది. దీంతో దీర్ఘకాలంగా డయాలసిస్ చేయించుకోవాల్సిన రోగులకు సమీప ప్రాంతాల్లోనే చికిత్స పొందే సదుపాయం కలుగుతుంది. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతోపాటు, రోగులు, వారి కుటుంబాలపై ప్రయాణ భారం, ఇతర ఖర్చులు తగ్గుతాయి. ఈ కేంద్రాల ద్వారా అందే సేవలకు ఏడాదికి రూ.11 కోట్ల వరకు వ్యయమవుతుంది. ఇప్పటికే పిఎంఎన్డిపి ద్వారా నడుస్తోన్న 61 కేంద్రాల్లో 754 మెషీన్లు పనిచేస్తున్నాయి.
పెరుగుతున్న వైద్య సేవల వ్యయం
2024-25లో ఈ రెండు కేటగిరీల్లో కలిపి డయాలసిస్ సేవలకు గాను ప్రభుత్వం రూ.126.58 కోట్లు వెచ్చించింది. 2025-26 నాటికి ఈ మొత్తం రూ.197.88 కోట్లకు చేరింది. 2026-27లో ఇప్పటి వరకు అయిన వ్యయం రూ.90.09 కోట్లు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు కింద ప్రభుత్వ రంగంలో 21, ప్రైవేట్, కార్పొరేట్ రంగాల్లో కలిపి 149 డయాలసిస్ కేంద్రాలున్నాయి.
Prajavartha Online Telugu News