-గతేడాది మొత్తం ఓపీ సేవల్లో 65 శాతం, ఐపీ అడ్మిషన్లలో 71 శాతం నమోదు
-సిబ్బంది హాజరు 81.89 శాతానికి పెరుగుదల
-జాతీయ ఆయుష్ మిషన్ కింద రూ.185.75 కోట్ల నిధులు.. ఈ ఏడాది అదనంగా రూ.22 కోట్లు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలు మెరుగుపడుతున్నాయి. ఆసుపత్రుల్లో మందులను అందుబాటులో ఉంచడం, వైద్యుల సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం వంటి చర్యలతో రోగులకు మెరుగైన వైద్యం అందుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన మొత్తం ఓపీ సేవల్లో 65 శాతం, ఐపీ అడ్మిషన్లలో 71 శాతం నమోదయ్యాయి. సిబ్బంది హాజరు శాతం కూడా 79.32 నుంచి 81.89కు పెరిగింది. వైద్య సేవల విస్తరణతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్యుల నియామకాలు, మౌలిక వసతుల అభివృద్ధిపై శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
ఆరు నెలల్లో 16,22,656 ఓపీ సేవలు
ఆయుష్ శాఖ పరిధిలోని ఆసుపత్రుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 16,22,656 ఓపీ సేవలు నమోదయ్యాయి. ఈ సంఖ్య గత ఆర్థిక సంవత్సరంలో అందించిన మొత్తం ఓపీ సేవల్లో 65 శాతానికి సమానం. ప్రజలకు ఆయుష్ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు చేపట్టిన చర్యలు ఈ పురోగతికి దోహదపడుతున్నాయి.
ఆరు నెలల్లో 9,230 ఐపీ అడ్మిషన్లు
ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందే ఇన్పేషెంట్ (ఐపీ) సేవల్లోనూ పురోగతి నమోదైంది. తొలి ఆరు నెలల్లో 9,230 ఐపీ అడ్మిషన్లు నమోదయ్యాయి. ఇది గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన మొత్తం ఐపీ అడ్మిషన్లలో 71 శాతానికి సమానం.
ఓపీ సేవల విస్తరణకు ప్రత్యేక చర్యలు
గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వారానికి రెండుసార్లు తప్పనిసరిగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వైద్యులు అందుబాటులో లేని లేదా మూసివేసిన ఔషధాలయాలను గుర్తించి, అక్కడ ఇన్ఛార్జిలను నియమించడం ద్వారా సేవలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రోగులకు అవసరమైన నాణ్యమైన ఆయుష్ మందులను అందుబాటులో ఉంచుతున్నారు. జాతీయ ఆయుష్ మిషన్ నిధులతో కొత్త వైద్యులను నియమిస్తున్నారు. ఇందులో భాగంగా 12 మంది హోమియోపతి వైద్యులు, ముగ్గురు యునాని వైద్యుల నియామకాలు చేపట్టారు. ఓపీ సేవల పురోగతిని సమీక్షించేందుకు ప్రతి మంగళవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ, నిర్దేశించిన లక్ష్యాల సాధనను పర్యవేక్షిస్తున్నారు.
ఐపీ సేవల బలోపేతానికి ప్రాధాన్యం
ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందే రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిపుణులైన వైద్యులను అందుబాటులోకి తెస్తున్నారు. రోగులు త్వరగా కోలుకునేలా నాణ్యమైన మందులను సరఫరా చేస్తున్నారు. ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యతను పెంచడంతో పాటు, రోగులకు అవసరమైన చికిత్స నిరంతరాయంగా అందేలా చర్యలు చేపడుతున్నారు.
సిబ్బంది హాజరు 81.89 శాతానికి పెరుగుదల
ఆయుష్ శాఖలో సిబ్బంది హాజరు శాతం గతంలో 79.32గా ఉండగా, ప్రస్తుతం 81.89కు పెరిగింది. వైద్య సేవలు సక్రమంగా, నిరంతరాయంగా అందించడంలో సిబ్బంది హాజరు కీలకం కావడంతో ఈ అంశంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
బోధనా ఆసుపత్రుల్లో విస్తృతంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు
రాష్ట్రంలోని నాలుగు ప్రధాన ఆయుష్ వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రుల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. వీటిలో ఒక ఆయుర్వేద, మూడు హోమియోపతి వైద్య కళాశాలలు ఉన్నాయి. గుడివాడలోని డాక్టర్ గురురాజు ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల, ఆసుపత్రితో పాటు ప్రభుత్వ ఆయుర్వేద, హోమియోపతి వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనా ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 21,420 ప్రయోగశాల పరీక్షలు, 148 ఎక్స్రేలు, 475 ఈసీజీ పరీక్షలు చేశారు. తద్వారా రోగులకు అవసరమైన వ్యాధి నిర్ధారణ సేవలను వేగంగా అందిస్తున్నారు.
జాతీయ ఆయుష్ మిషన్ కింద రూ.185.75 కోట్ల నిధులు.. అదనంగా రూ.22 కోట్లు
జాతీయ ఆయుష్ మిషన్ కింద రాష్ట్రానికి రూ.185.75 కోట్ల నిధులు ఆమోదం పొందాయి. రాష్ట్ర చరిత్రలో ఇవే అత్యధిక ఆమోదిత కేటాయింపులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఈ నిధుల నుంచి రూ.38.18 కోట్లను వినియోగించారు. దీనికి అదనంగా, 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జాతీయ ఆయుష్ మిషన్ రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద దాదాపు రూ.22 కోట్ల అదనపు నిధులు మంజూరయ్యాయి. వైద్య సేవల విస్తరణ, వైద్యుల నియామకాలు, మౌలిక వసతుల అభివృద్ధి తదితర కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగిస్తున్నట్లు ఆయుష్ సంచాలకుడు రోణంకి గోపాలకృష్ణ తెలిపారు.
Prajavartha Online Telugu News