– నిష్పాక్షికంగా, పారదర్శకంగా అమలుకు చర్యలు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్)ని పటిష్టంగా అమలు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ మేరకు ప్రవర్తనా నియమావళిని నిష్పాక్షికంగా, పారదర్శకంగా అమలు చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో ఉన్న మంత్రులు, రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీల వివరాలన్నింటినీ తొలగించాలి లేదా కప్పి ఉంచాలని.. అదేవిధంగా ప్రభుత్వ నిధులతో ఏర్పాటుచేసిన హోర్డింగ్లు, ప్రకటనల్లో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల ఫొటోలు, పేర్లు, గుర్తులు, సందేశాలను తొలగించాలని సూచించారు. రాజకీయ నాయకుల విగ్రహాలను పూర్తిగా కప్పి ఉంచాలని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నంతకాలం జారీచేసే విద్యుత్, నీటి బిల్లులపై రాజకీయ ప్రచారానికి సంబంధించిన ఫొటోలు, సందేశాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎంసీసీకి సంబంధించిన అన్ని మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటించాలని.. నిబంధనల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Prajavartha Online Telugu News