-విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొన్న ప్రముఖ సినీ నటుడు బండ్ల గణేష్, ఎంపీ కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి,కేశినేని వెంకట్, బోండా సిద్ధార్థ
-సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలతో అలరించిన కళాకారులు
-అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులకు జ్ఞాపికలు అందజేత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఉత్సవ్ 2.0లో భాగంగా సింగనగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి, వారి కుమారుడు వెంకట్ బోండా సిద్ధార్థ, పొడపాటి తేజస్వి, సొసైటీ ఫర్ వైబ్రేట్ విజయవాడ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్సవంలో భాగంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలను ముఖ్య అతిథులు ఆసక్తిగా తిలకించారు. కళాకారులు తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వివిధ కళారూపాలను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న కళాకారులకు ముఖ్య అతిథులు జ్ఞాపికలను అందజేసి అభినందించారు.
ప్రముఖ సినీ నటుడు బండ్ల గణేష్ మాట్లాడుతూ..
విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. విజయవాడ నగరంలో ఇంతటి ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, కళారూపాలను భవిష్యత్ తరాలకు పరిచయం చేయడంలో విజయవాడ ఉత్సవ్ వంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న కళాకారులందరికీ అభినందనలు తెలిపారు.
కేశినేని జానకి లక్ష్మి మాట్లాడుతూ..
విజయవాడ ఉత్సవ్ 2.0లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని అన్నారు. నగరంలో కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. కళాకారులు తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. విజయవాడ ఉత్సవ్ ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ నగరంలో పండుగ వాతావరణాన్ని నెలకొల్పుతోందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్న నిర్వాహకులను, కళాకారులను అభినందించారు.
కేశినేని వెంకట్,బోండా సిద్ధార్థ మాట్లాడుతూ..
విజయవాడ ఉత్సవ్ 2.0లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. కళాకారులు తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. యువత తమలోని ప్రతిభను వెలికితీసి కళలు, సంస్కృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. విజయవాడ ఉత్సవ్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడం నగర ప్రజల ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి నిదర్శనమని తెలిపారు.
విజయవాడ ఉత్సవ్ 2.0 ద్వారా నగరంలో కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రోత్సాహం లభిస్తోందని, ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు కళాకారులకు మంచి గుర్తింపును తీసుకువస్తాయని ముఖ్య అతిథులు పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News