-గ్రామీణ మహిళల ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్
-విజయవాడలో జాతీయ సరస్ మేళా-2026 ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్ను ప్రవేశపెట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మహిళలను సంపద సృష్టికర్తలుగా తీర్చిదిద్దడం, గ్రామాలను ఉపాధి కేంద్రాలుగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా-2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించారు.
రాష్ట్రంలో 11 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 1.10 కోట్ల మంది సభ్యులు ఉన్నారని, ఈ సంఘాల ద్వారా రూ.69 వేల కోట్ల టర్నోవర్ నమోదవుతోందని సీఎం తెలిపారు. ఏడాది కాలంలో లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని, మరో ఐదు లక్షల మందిని ఆ దిశగా ప్రోత్సహిస్తామని చెప్పారు. మేళాలో 650 స్వయం సహాయక సంఘాలు పాల్గొంటున్నాయని, మహిళల ఉత్పత్తులకు ఏడాది పొడవునా మార్కెట్ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ‘స్వయం ఏపీ’ బ్రాండ్ ద్వారా ఈ-కామర్స్, ఆన్లైన్ వేదికలపై విక్రయించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను వ్యాపారాభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి స్వయం సహాయక సంఘం ఆర్థిక శక్తిగా, ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా, ప్రతి గ్రామం ఉపాధి కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు.
మహిళల సాధికారతతోనే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్ఫూర్తిదాయక జీవన ప్రస్థానాన్ని సీఎం ప్రస్తావించారు. సంక్షేమ పథకాలతో మహిళలకు అండగా నిలుస్తూనే, వారిని ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, హోంమంత్రి అనిత తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News