తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పులికాట్ పక్షుల అభయారణ్య పర్యావరణ వలయం కొరకు క్షేత్ర స్థాయి జోనల్ మాస్టర్ ప్రతిపాదనలు సిద్దం కావాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన సంబందిత అధికారులతో పులికాట్ పక్షుల అభయారణ్య పర్యావరణ వలయం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారీ పై జరిగిన తొలి సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ వన్య ప్రాణుల సంరక్షణ డివిజన్ సూళ్ళురుపేట లోని పులికాట్ పక్షుల అభయారణ్యం వలయం కొరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ నం. 1365 తేదీ 26.06.2015 ప్రకారం పులికాట్ పక్షి అభయారణ్యం చుట్టూ 2 కి.మి ల పరిధిలో పర్యావరణ హిత జోన్ యొక్క సమర్థవంతమైన నిర్వహణ కోసం జోనల్ మాస్టర్ ప్లాన్ ను గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన 2 సంవత్సరాలలోపు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖల సమన్వయంతో తయారు చేయాల్సి ఉన్న నేపథ్యంలో నిబంధనలకు లోబడి పోల్యుషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ మరియు వన్య ప్రాణి సంరక్షణ, వ్యవసాయ శాఖ, ఆర్&బి శాఖ, రెవెన్యూ, అర్బన్ డెవలప్మెంట్, పర్యాటక శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, మునిసిపల్, పంచాయతి రాజ్, ఇరిగేషన్, ఆర్.డబ్ల్యు.ఎస్, తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సిద్డం చేయాలని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పులికాట్ బర్డ్ జోన్ లో నిషేదించబడిన పర్యావరణానికి హాని కలిగించే వ్యవసాయ మందులు, ఆక్వా కల్చర్, వాణిజ్య మైనింగ్, కొత్తగా బోర్లు వేయడం, వంటివి చేపట్టరాదని అన్నారు. పునరుత్పాదక విద్యుత్ శక్తి, సేంద్రీయ వ్యవసాయం, భూగర్భ విద్ద్యుత్తు కేబులింగ్ వంటి వాటిని ప్రోత్సహించాలని తదితర అంశాల పై చర్చించి దిశా నిర్దేశం చేసారు. జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయుటకు వన్యప్రాణులు సంరక్షణ అధికారులు ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేసి సంబందిత అధికారులకు ఈ అంశంపై మరియు కేంద్ర ప్రభుత్వ నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమీక్షలో డి.ఆర్.ఓ శ్రీనివాస రావు, శ్రీకాళహస్తి ఆర్డీఓ రామారావు, డి.ఎఫ్.ఓ వైల్డ్ లైఫ్ శివకుమార్, శామ్యూల్, తుడా సెక్రటరీ లక్ష్మి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పి.సి.బి రాజశేఖర్, సూళ్ళూరు పేట డివిజన్ ఆర్ అండ్ బి, ఆర్ డబ్ల్యు ఎస్, ఇరిగేషన్ అధికారులు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ రావు, జిల్లా పంచాయితీ అధికారి రాజశేఖర్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News