తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
బడుగు బలహీన వర్గాల అభివృద్దే దేశ అభివృద్ధి అని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమ బోర్డు జాతీయ కమిటీ సభ్యులు తుర్క నరసింహ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నందు డి ఆర్ ఓ, శ్రీనివాస రావు తో కలసి విద్య,వైద్య, పోలీసు, ఎస్సి,ఎస్టీ, బిసి, స్త్రీ శిశు సంక్షేమ, గనులు భూగర్భ, సంక్షేమ శాఖల లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి అమలు పరచే సంక్షేమ పథకాల పై నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలతో అట్టడుగు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల అభివృద్దే దేశాభివృద్ది, దేశంలోని అట్టడుగు బడుగు బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమ కోసం జాతీయ స్థాయిలో అభివృద్ధి సంక్షేమ బోర్డును జాతీయ కమిటీని ఏర్పాటు చేయడంజరిగిందని అందులో చైర్మన్ తోపాటుగా సభ్యులు ఉంటారని తెలిపారు,ఈ కమిటీ సభ్యులు జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లాలోని బడుగు బలహీన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఆమలు పరిచే సంక్షేమ పథకాలు వారికి సకాలంలో అందుతున్నాయా లేదా అని పరిశీలించడం, అధికారులతో సమావేశాలు నిర్వహించి సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమలు పరిచే సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలలో డిస్ప్లే చేయాలని సంబందిత అధికారులకు సూచించారు. రాష్ట్ర మరియు జిల్లాలోని గ్రామ స్థాయిలో ఉన్న బిసి ల లోని ఉప కులాల వారిగా జనాభా సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన చో కేంద్రం ప్రభుత్వం బడ్జెట్ లో బీసీలకు ఎక్కువ నిధులు కేటాయించుటకు అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరిచే సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం బాగా ఉపయోగించు కుంటోందని రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం తో పాటు సీబీసీఎస్ఇ సిలబస్ తో పాఠశాలలో బోధిస్తున్నారని తెలిపారు. ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ పై దృష్టి సాధించి అనుభవం కలిగిన టీచర్స్ తో పై ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులకు మంచి భవిష్యత్ కల్పించాలన్నారు. విద్య లో ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలని, ఉపాద్యాయులతో ముఖా ముఖీగా చర్చ నిర్వహించారు. ఇంకా అనుభవం కలిగిన ఉపాధ్యాయుల సలహాలు సూచనలు తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. జిల్లాలో ఎస్సి, ఎస్టీ ల పై జరిగే దాడుల కు సంబంధించి అట్రాసిటీ కేసులు నమోదు చేసి వాటిని సత్వర పరిష్కారం చేసి వారికి సకాలంలో నష్ట పరిహారం చెల్లించాలని, అట్రాసిటీ కేసుల కు సంబంధించి సమస్యలు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని డిఎస్పీకి సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరిచే ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో గృహాల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి చెన్నయ్య, బిసి సంక్షేమ మరియు సాధికారత అధికారి యుగంధర్, స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి లక్ష్మి దేవి, భూగర్భ గనులు శాఖల అధికారులు,గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్స్, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News