Breaking News

ధాన్యానికి ఇతర రాష్ట్రాల కంటే ఏ.పిలోనే మంచి ధర లభిస్తుంది…

బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతుధరతో 40 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అంశాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని ఏ.పి ఉపముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశం మంగళవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో జరిగింది.

బాపట్ల జిల్లాలో నిరుపేద ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఓ.సిలకు 255 ఎకరాల భూమిని పంపిణీ చేయడానికి అసైన్డ్ మెంట్ కమిటి అధికారికంగా ఆమోదించిందని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ఎస్. సిలలో 367 మంది, ఎస్.టిలలో 90 మంది, బి.సిలలో 15 మంది, ఓ.సిలలో 27 మందికి అసైన్డ్ మెంట్ భూములను అందజేయనున్నామని తెలిపారు. ధాన్యానికి ఇతర రాష్ట్రాల కంటే ఏ.పిలోనే మంచి ధర లభిస్తుందని ఉపముఖ్యమంత్రి చెప్పారు. లక్ష్యం మేరకు బాపట్ల జిల్లాలో ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. మరో 20 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలని శాసనసభ్యులు కోరడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటి నియమించాలన్నారు. జిల్లాలో పండిన పసుపు పంటను కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతుపక్షపాత ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు. రబిలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

తాగు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఉపముఖ్యమంత్రి సత్యనారాయణ ఆదేశించారు. ముఖ్యంగా సాగునీటి కాలువల పూడికతీత పనులు, మరమ్మతులు చేపట్టాలని, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. దెబ్బతిన్న మొక్కజొన్న పంటలు గుర్తించడానికి సర్వే చేయాలన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజారోగ్యంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వివరించారు. నాడు-నేడు కార్యక్రమంతో వైద్యశాలల్లో ఖాళీ పోస్టులన్నీ భర్తీ అయ్యాయని, మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. 2వ దశలో 543 పాఠశాలలను రూ.192 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశచరిత్రలోనే ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా జరగలేదన్నారు. మే 15వ తేదీలోగా ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాలకు పెండింగ్ బిల్లులు అన్ని చెల్లిస్తామన్నారు. అభివృద్ధిలో బాపట్ల జిల్లాను ప్రథమస్థానంలో నిలపడానికి కృషిచేయాలన్నారు. వేసవిలో నిరుపేదలకు ఉపాధి కల్పించేలా ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పనులు విస్తృతంగా చేపట్టాలన్నారు. నిజాంపట్నం ఓడరేవును అభివృద్ధి చేస్తుండగా మరోవైపు సీఎం ప్రత్యేక చొరవతో ఆక్వా రంగాన్ని మరింత విస్తృతం చేస్తున్నారని తెలిపారు. ఎన్.డి.బి.పి ద్వారా బాపట్ల జిల్లాలోని రహదారులన్నీ అభివృద్ధి చేయాలన్నారు. ప్రస్తుతం చేపట్టిన పనులలో రాజీపడొద్దు, జాప్యం చేయవద్దని ఆయన సూచించారు. సూక్ష్మ, బిందు, తుంపర సేద్యంతో సాగువిస్తీర్ణాన్ని మరింతగా పెంచాలన్నారు. పశువైద్యాధికారుల కొరత కొంత తీరిందని, నాణ్యమైన వైద్యం పశువులకు క్షేత్రస్థాయిలో అందుతుందన్నారు. బాలలకు మెరుగైన విద్యను అందించడానికి నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వం ఎంతో కృషిచేస్తుందని ఆయన వర్ణించారు.

గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటి రవాణాకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. వేమూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. ఆర్అండ్ బి రహదారుల నిర్మాణానికి ఎస్.సి, ఎస్.టి ఉపప్రణాళిక నిధులు మంజూరు చేసినప్పటికి పనులు ప్రారంభించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. జాప్యం చేసే గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మురుగునీటి, పంటకాల్వల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టాలని మంత్రి దృష్టికి తెచ్చారు. అన్నీ ప్రాంతాల వారికి జలవనరులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దోనంపూడిలో వైద్యశాల నిర్మాణం మొదలు కాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. అకాలవర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టరు పి.రంజిత్ బాషా చెప్పారు. బాపట్ల జిల్లాలోని చెరువులన్నింటిని పూర్తిస్థాయిలో నింపామని జులై వరకు తాగునీటి సమస్య ఉండదని స్పష్టం చేశారు. గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి రవాణాకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. తాగునీటి చెరువులన్నింటిని శుభ్రం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్ పనులకు సకాలంలో టెండర్లు పిలిచి గుత్తెదారులు త్వరగా పనులు చేపట్టేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు అంచనాలు రూపొందించేందుకు త్వరగా సర్వే చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో తెలుసుకొని పరిష్కరించాలని ఏ.పి లెజిస్లేటివ్ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. రైతుల సమస్యలు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పంటకాల్వల లోకి సముద్రం నీరు వస్తున్నందున రైతులు నష్టపోతున్నారని ఆయన వివరించారు. భూగర్భజలాలు పెరగడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

లేటు ఖరీఫ్ లో వచ్చిన ధాన్యం
దిగుబడిని అధికారులు కొనుగోలు చేయాలని రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ సూచించారు. అకాల వర్షంతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. పంట కాలువలు పూడికతీత పనులు చేపడితే వ్యవసాయరంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

వ్యవసాయంలో 70 శాతంగా శ్రమించే కౌలు రైతులను అధికారులు విస్మరిస్తున్నారని శాసనమండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు అన్నారు. సి.సి.ఆర్.సి కార్డుల ద్వారా అధికంగా రుణాలు ఇవ్వాలన్నారు. పసుపు సాగుచేసే రైతులకు కనీస మద్దతుధర వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన గుంటూరు ఛానల్ ను పత్తిపాడు నుంచి బాపట్ల జిల్లాలోకి విస్తరింపచేయాలన్నారు. కేవలం రూ.120 కోట్ల నిధులు వెచ్చిస్తే 50 వేల ఎకరాలు సాగులోకివస్తాయన్నారు. డి.ఎస్.సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నారు. నాడు-నేడు పాఠశాలల అభివృద్ధి కార్యక్రమంతో ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభినందించారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌళిక వసతులు కల్పించడం అభినందనీయమన్నారు.

అక్కాయిపాలెం, పాపాయిపాలెం గ్రామాల్లో నీటి సమస్య పరిష్కారానికి ఎత్తిపోతల పథకం ఏర్పాటుచేయాలని ఉప ముఖ్యమంత్రి ని శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత కోరారు. చీరాల, వేటపాలెం మండలాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు.

వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన బాపట్లలో రైతులు పండించిన పంటలను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే మద్దతుధరతో కొనుగోలు చేయాలని శాసనసభ్యులు కోన రఘుపతి కోరారు. ప్రస్తుతం ధాన్యం అధికంగా పండగా ప్రభుత్వం తక్కువగానే కొనుగోలు చేసిందని మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రిని కోరారు. బాపట్ల జిల్లాలోని వ్యవసాయ రంగానికి ప్రధానమైన పంటకాల్వలు, మురుగుకాల్వలు 25 ఏళ్లుగా శుభ్రం చేయలేదని వాటి ద్వారా రైతులకు నష్టం జరుగుతుందన్నారు. ఉపాధిహామి పనుల ద్వారా అభివృద్ధి చేయాలని సూచించారు. పేరళి కాల్వకు చెక్ డ్యామ్ నిర్మించి సముద్రజలాలు కాల్వలోకి రాకుండా నియంత్రించాలన్నారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు పనులు చేయాలని మంత్రిని కోరారు.

చీరాల పట్టణంలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి మంత్రిని కోరారు. వేసవిలో తాగునీటి సమస్యరాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు నష్టం జరుగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టరు సి. హెచ్. శ్రీధర్, ప్రకాశం జెడ్.పి ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డి.ఆర్.ఓ కె. లక్ష్మీశివజ్యోతి, బుడా చైర్మన్ దేవినేని మల్లిఖార్జున, ఆర్.డి.ఓలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *