
-ఎఫ్టీపీసీ ఇండియా, స్టేట్ ఐకాన్స్ ఫోరం ఆధ్వర్యంలో హెల్త్ అండ్ మెడికేర్ అచీవ్మెంట్ అవార్డు – 2023 ప్రదానం
-యూ ఎస్ ఏ, యూ కే, ఇండియా లో ఫెలోషిప్స్ సాధించి మూడు దేశాలలో రోబోటిక్ సర్జరీ ట్రైనింగ్ పొందిన గణేష్ గొర్తి
-డాక్టర్ గణేష్ కు అవార్డును అందజేసిన బాలీవుడ్ నటి దేబలినా దత్తా
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రఖ్యాత రోబోటిక్ బేరియాట్రిక్, గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ గొర్తి గణేష్ కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. కాంటినెంటల్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు అత్యాధునిక రోబోటిక్ గ్యాస్ట్రో సర్జరీ సేవలందిస్తున్న ఆయనకు ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఐకాన్స్ ఫోరం ఆధ్వర్యంలో హెల్త్ అండ్ మెడికల్ అచీవ్మెంట్ అవార్డును అందజేశారు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ప్రివ్యూ థియేటర్ లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటి దేబలినా దత్తా ముఖ్య అతిధిగా పాల్గొని, డాక్టర్ గణేష్ కు అవార్డును ప్రదానం చేశారు. హెల్త్ అండ్ మెడికేర్ అచీవ్మెంట్ పురస్కారం అందుకున్న డాక్టర్ గణేష్ ను కార్యక్రమ నిర్వాహకులు పుష్పగుచ్ఛం, దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీపీసీ ఇండియా చైర్మన్ చైతన్య జంగా మాట్లాడుతూ, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి తమ సంస్థ ద్వారా పురస్కారాలను అందిస్తున్నామని అన్నారు. దేశ విదేశాల్లోని ప్రతిష్ట్మాత్మక వైద్య సంస్థల్లో శిక్షణ పొంది, ఎస్ ఎస్ ఐ మంత్ర రోబోట్ తో దేశంలోనే మొట్టమొదటి రోబోటిక్ బేరియాట్రిక్ సర్జరీ చేసి ఖ్యాతి గడించిన డాక్టర్ గణేష్ కు అవార్డును అందజేయడం అనేక మంది యువ వైద్యుల్లో స్ఫూర్తినింపుతుందని తెలిపారు. స్టేట్ ఐకాన్స్ ఫోరం సెక్రటరీ పీవీఎస్ వర్మ మాట్లాడుతూ, పూర్తిగా మనదేశంలో రూపొందిన ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ సర్జరీ యూనిట్ ద్వారా డాక్టర్ గణేష్, గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో సేవలందిస్తున్నారని చెప్పారు. బేరియాట్రిక్ సర్జరీలు, గాల్ బ్లాడర్ సర్జరీలు, హెర్నియా సర్జరీలను రోబోటిక్ విధానంలో నిర్వహిస్తూ అత్యంత విజయవంతమైన రోబోటిక్ సర్జన్ గా డాక్టర్ గణేష్ ఖ్యాతి గడించారని తెలిపారు. బాలీవుడ్ నటి దేబలినా దత్తా మాట్లాడుతూ, అవార్డు గ్రహీత డాక్టర్ గణేష్ తో పాటు, కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. ఎఫ్టీపీసీ ఇండియా-స్టేట్ ఐకాన్స్ ఫోరం పురస్కార గ్రహీత డాక్టర్ గొర్తి గణేష్ మాట్లాడుతూ, అత్యాధునిక రోబోటిక్ బేరియాట్రిక్, గ్యాస్ట్రో సర్జరీ సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తేవాలనేదే తన లక్ష్యమని అన్నారు. రోబోటిక్ సర్జరీ విధానం సాంప్రదాయ సర్జరీలతో పోల్చితే అత్యంత ఖచ్చితమైనదని చెప్పారు. రోబోటిక్ సర్జరీ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే కాకుండా ఆపరేషన్ అనంతరం పేషేంట్ త్వరగా కోలుకోగలుగుతారని డాక్టర్ గణేష్ వివరించారు. తనకు అవార్డును అందజేసిన ఎఫ్టీపీసీ ఇండియా, స్టేట్ ఐకాన్స్ ఫోరంలకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News