Breaking News

రైతులకు మెరుగైన సేవలు అందజేయడంలో జిల్లాస్థాయి వ్యవసాయ సలహామండళ్ల పాత్ర కీలం

-రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి
-ముందుగా సాగునీరు విడుదల చేయడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి
-రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
-గత ప్రభుత్వంతో పోల్చితే తమప్రభుత్వం భారీ స్థాయిలో రైతుల నుండి ధాన్యంకొనుగోళ్లు చేసింది
-రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులకు మరింత మెరుగైన సేవలు అందజేసేందుకు అవసరమైన పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండళ్లు పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వెలపూడిలోని ఆంద్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర స్థాయి వ్యవసాయ సలహా మండలి మొదటి సమావేశం మంత్రి అధ్యతన జరిగింది. ఈ సలహా మండలిలోని సభ్యులైన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో పాటు అన్ని జిల్లాల స్థాయి వ్యవసాయ సలహా మండళ్ల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొని పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు పలు సూచనలు, సలహాలను అందజేశారు.

ఈ సందర్బంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 68 శాతం ఉన్న రైతుల సంక్షేమానికై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం జరుగుచున్నదన్నారు. గ్రామ స్థాయిలో విత్తు నుండి విక్రయం వరకూ అన్ని రకాల సేవలను రైతులకు అందజేయాలనే లక్ష్యంతో అన్ని గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు దేశంలోని పలు రాష్ట్రాలకే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థగా ఉన్నటు వంటి పుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చాంఫియన్ అవార్డుల నామినేషన్ కై మన రైతు భరోసా కేంద్రాలు ఎంపిక కావడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. అదే విధంగా ఇ-క్రాప్ విదానం ద్వారా అన్ని రకాల పంటల వివరాలను నమోదు చేయడం, దాని ఆధారంగా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం, ఉచిత పంటల భీమా పథకాన్ని అమలు చేయడం, ఇన్పుట్ సబ్సిడీ పంపిణీతో పాటు పలు రకాల సంక్షేమ పథకాలను అమలు చేయడం వంటి తదితర రైతు సంక్షేమ కార్యక్రమాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా కాకుండా ఏ సీజన్ లో జరిగిన పంట నష్టాన్ని అదే సీజన్ ముగిసే లోపే అందజేయడం జరుగుచున్నదన్నారు. వ్యవసాయానికి సంబందించి అన్ని రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్రంలోని 147 గ్రామీణ నియోజక వర్గాల్లో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇప్పటికే 73 అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ల పనులను పూర్తి చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. జూలై 8 వ తేదీన మిగిలిన 52 అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా ముందస్తుగా సాగునీరు రైతులకు అందిస్తున్నందున ప్రకృతి వైపరీత్యాల నుండి రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను కాపాడుకోవడమే కాకుండా ఏడాదికి రెండు మూడు పంటలు సాగుచేసుకునేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ముందుగా సాగునీరు అందించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఏడాదికి సగటున 15 లక్షల టన్నుల వరకూ పెరిగాయని మంత్రి తెలిపారు. కౌలు రైతుల హక్కులను పరిరక్షించేందుకు కౌలు రైతుల అందరికీ సి.సి.ఆర్.సి. కార్డులు పంపిణీచేయడం జరుగుతున్నదని, భూస్వాములు అందరూ ఈ కార్యక్రమానికి సహకరించే విధంగా జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండళ్లు కృషిచేయాలని మంత్రి ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్కు సంబందించి దాదాపు రూ.963 కోట్ల బకాయిలు పెట్టి పోవడం జరిగిందని, అయితే ఆ బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించి డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను పునరుద్దరించడం జరిగిందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం 31 స్థానంలో ఉండేదని, తమ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తదుపరి అది 13 స్థానానికి చేరిందని, ప్రస్తుతానికి దేశంలోనే మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఐదు,ఆరు స్థానాల్లో నిలిచే అవకాశం ఏర్పడిందని మంత్రి తెలిపారు. ఈ విధంగా వ్యవసాయ రంగం సమగ్ర అభివృద్దికి, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం విస్తృత స్థాయిలో కృషిచేస్తున్నదని, ఆ సేవలను మరింత విస్తృత పర్చేందుకు జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండళ్లు తగు సూచనలు, సలహాలు అందజేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో సంస్థాగత మార్పులు, విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చిన ఘనత రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. గ్రామ స్థాయిలోనే విత్తు నుండి విక్రయం వరకూ అన్ని రకాల సేవలు అందజేసే ఆర్.బి.కె.ల్లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడంతో పాటు ముందుగానే సాగునీరు విడుదల చేయాలనే నిర్ణయం చారిత్రాత్మకమైందన్నారు. రైతులు ఆరుగాలాలు కష్టపడి పండించే పంటలు సాదారణంగా ప్రతి ఏడాది నవంబరు, డిశంబరు మాసాల్లో సంభవించే ప్రకృతి వైపరిత్యాల బారిన పడకుండా ముందుగానే ఆ పంటను వారి ఇళ్లకు చేర్చుకోవాలనే లక్ష్యంతో ముందుగానే సాగునీరు విడుదల చేయడం అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకారమే గత ఏడాది శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఫలితంగా పంట ఉత్పత్తులు గుణనీయంగా పెరగడమే కాకుండా ఏడాదికి రెండు, మూడు పంటలు పండించుకునే అవకాశం ఏర్పడిందన్నారు. అదే విదంగా రైతులు పండించే పలు రకాల పంటలకు కనీస మద్దతు ధరను కల్పించడమే కాకుండా ఇ-క్రాప్ విదానం ద్వారా ఉచిత భీమా సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రైతులకు అన్ని విదాలుగా మేలు చేసేందుకు పలు వినూత్న కార్యక్రమాలను అమలు పర్చడం జరుగుతుందని, అయితే వాటన్నింటిపై రైతులు అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకునేలా జిల్లా వ్యవసాయ సలహా మండళ్లు కృషి చేయాలని ఆయన సూచించారు.

రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రైతులకు అన్ని విదాలుగా మేలు చేయాలనే లక్ష్యంతో పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం జరుగుచున్నదన్నారు. వీటిలో భాగంగా దళారుల ప్రమేయం ఏమాత్రం లేకుండా ఇ-క్రాప్ ఆధారంగా ఆర్.బి.కె.ల ద్వారా ప్రభుత్వమే రైతుల నుండి నేరుగా ధాన్యం కొనుగోళ్లను పెద్ద ఎత్తున చేయడమే కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర నేరుగా రైతుల ఖాతాల్లో జమచేయడం జరుగుచున్నదన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల్లోనే సొమ్మును రైతులకు చెల్లించడం జరుగుచున్నదని, రానున్న రోజుల్లో మూడునాలుగు రోజుల్లోనే ధాన్యం కొనుగోలు సొమ్మును రైతులకు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం గత నాలుగేళ్లలో 32.78 లక్షల రైతుల నుండి 3 కోట్ల 10 లక్షల 72 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.58,773 కోట్లను రైతులకు చెల్లించడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో కేవలం 17.94 లక్షల రైతుల నుండి 2 కోట్ల 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసి రూ.40,230 కోట్లను రైతులకు చెల్లించడం జరిగిందని మంత్రి తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాగులు, జొన్నలు, కందులు వంటి చిరుధాన్యాలను ప్రోత్సహించాలని ఆదేశించారని, వారి ఆదేశాను ప్రకారం రైతులను ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ పలు అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, జిల్లా వ్యవసాయ సలహా మండళ్లు కూడా చిరుదాన్యాల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార శాఖ స్పెషల్ సి.ఎస్. ద్వివేది, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. హరికిరణ్, రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ ఉపాధ్యక్షులు ఎం.వి.ఎస్.నాగి రెడ్డి తదితరులు ఈ సమావేశంలో ప్రసంగించగా అన్ని జిల్లాల వ్యవసాయ సలహా మండళ్ల అధ్యక్షులు వారి సూచనలు, సలహాలను అందజేశారు.

రాష్ట్ర సహకార, మార్కెటింగ్ శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ చిరంజీవి చౌధరి, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ మరియు మార్కుఫెడ్ ఎం.డి. రాహుల్ పాండే, మార్కుఫెడ్ చైర్మన్ నాగిరెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ జాన్సీరాణి, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు తిరుపాల్ రెడ్డి, ఉద్యాన వన శాఖ సలహాదారులు ప్రసాద రెడ్డి, సహకార శాఖ సలహాదారులు బ్రంహ్మనంద రెడ్డి, రైతు సాధికారత సమితి సలహాదారులు ప్రభాకర రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *