విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇండియన్ సొసైటీ ఫర్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ వారి ఆధ్వర్యంలో చెన్నైలో అక్టోబర్ 27, 28వ తేదీలలో జరిగిన ‘‘హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధి, ఆధునిక వైద్య విధానాలు మరియు ప్రాణాపాయం నుంచి తప్పించే వైద్య విధానాలపై’’ జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు హార్ట్ ఫెయిల్యూర్ పేషంట్లకు క్లిష్టతరమైన వైద్య చికిత్సలు మరియు స్టెంట్ యాంజియోప్లాస్టీ లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
శరీరంలో ఉన్న కణాలకు ఆక్సిజన్ మరియు పోషకాలు అందించే ప్రక్రియ గుండె పంపింగ్ చర్యపై ఆధారపడి ఉంటుంది. గుండె తన సామర్ధ్యానికి తగిన విధంగా రక్తాన్ని పంపింగ్ చేయలేని స్థితినే హార్ట్ ఫెయిల్యూర్ అంటారని డాక్టర్ రమేష్ బాబు తెలియజేస్తూ హృదయం వైఫల్యం చెందటానికి రక్తపోటు, మధుమేహం, గుండె రక్తనాళాల్లో పూడికలు మరియు సైలెంట్ హార్ట్ ఎటాక్ వ్యాధి ప్రధాన కారణాలుగా ఉన్నాయని ఈ రోగులలో ఆయాసం, నీరసం, నిస్సత్తువ, అలసట, కనీస వ్యాయామం మరియు శారీరక శ్రమ చేయలేకపోవడం, కాళ్లల్లో, పొట్టల్లో వాపు మరియు నీరు చేరటం వంటి లక్షణాలు ఉంటాయని తెలియజేశారు.
4 దేశాలకు చెందిన గుండె వైద్య నిపుణులు, గుండె మరియు ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్సా వైద్య నిపుణులు, ఎక్మొ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు పాల్గొన్న ఈ సదస్సులో వక్తలు మాట్లాడుతూ అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశంలో కూడా 60 లక్షల మందికిపైగా రోగులు హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధితో బాధపడుతున్నారని వీరిలో 50 శాతానికి పైగా వ్యాధి నిర్ధారణ ప్రక్రియ ఆలస్యం అవుతుందని వివరించారు. భారతదేశంలో కూడా ప్రతి సంవత్సరం పది లక్షలకు పైగా రోగులు హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధికి గురవుతున్నారని వ్యాధి నిర్ధారణ, సత్వర వైద్య చికిత్స మరియు వైద్య పునరావాసం ఈ వ్యాధిలో కీలక అంశాలని డాక్టర్ రమేష్ బాబు తెలియజేశారు. క్వాడ్రాపుల్ థెరపీ, ఎమర్జెన్సీ బైపాస్ శస్త్ర చికిత్స ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ రోగుల జీవన ప్రమాణాలను ఒక దశాబ్దం పాటు పొడిగించవచ్చని కొన్ని ప్రత్యేకమైన అత్యాధునికమైన డివైజ్‌ల ద్వారా మరియు క్లిష్టతరమైన కరొనరి ఇంటర్వెన్షన్ ప్రక్రియల ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ రోగులకు ఉపశమనం కలిగించవచ్చని రక్తపోటు, హృదయ స్పందన రేటు మరియు ఈసీజీ పరీక్షలను అందించే అత్యాధునిక వేరబుల్ డివైజెస్‌లను ఇటువంటి రోగులు వాడటం అత్యంత వుపయోగకరమని డాక్టర్ రమేష్ బాబు తెలియజేశారు.
ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి. శ్రీనివాసరావు మాట్లాడుతూ హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధి నిర్ధారణ కోసం విజయవాడ, గుంటూరు మరియు ఒంగోలులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్‌లో అత్యాధునిక వైద్య పరీక్షలైన సి.టి క్యాల్షియం స్కోర్, సి.టి.యాంజియోగ్రామ్, కార్డియాక్ ఎం.ఆర్.ఐ వంటి పరీక్షలు నిర్వహించే పరికరాలతో పాటు ప్రత్యేక టెలి ఐ.సి.యు (క్లౌడ్ డాక్స్ రమేష్) విభాగం ద్వారా నిరంతరం పర్యవేక్షణతో పాటు ఎక్మో, ఇంట్రా అయోటిక్ బెలూన్ పంప్ (ఐ.ఎ.బి.పి) మరియు ఎల్ వాడ్ వంటి అత్యాధునిక పరికరాలను వినియోగించడంలో నిష్ణాతులైన హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ టీమ్, ఎలక్ట్రో ఫిజియాలజిస్ట్ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులను అందుబాటులో ఉంచామని తెలియచేసారు.
ఈ పత్రికా సమావేశంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్టులు డాక్టర్ సోమనాథ్, డాక్టర్ హరిత, డాక్టర్ అనూప్ ప్రత్యేక ఎక్మో స్పెషలిస్ట్ డాక్టర్ బికాస్ సాహూ, క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు డాక్టర్ ధరణీంద్ర మరియు బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ డాక్టర్ వై.కార్తీక్ చౌదరి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News