మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన సంవత్సరంలో మంచి ఆలోచనలు, కార్యాలతో జీవితాన్ని ప్రారంభించేందుకు మొదటి అడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు ఆదివారం ఉదయం నగరంలోని బచ్చుపేట శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నూతన నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి
ఈ వేడుకలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఏమైనా తప్పులు చేసి ఉండినట్లయితే వాటిని వదిలేసి కొత్త సంవత్సరంలో మంచి ఆలోచనలు, కార్యాలతో జీవితాన్ని పునః ప్రారంభించుకునేందుకు మొదటి అడుగు వేయాలన్నారు. జీవితాన్ని మంచి ఉద్దేశంతో మొదలు పెట్టడానికి ఇదొక సువర్ణ అవకాశం అన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో తులతూగాలని ఆకాంక్షించారు.
చిన్న చిన్న మంచి పనులు మార్పులతో మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలన్నారు. రహదారిపై ద్విచక్ర వాహనం లో ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ప్రాణాలను రక్షిస్తుందని తెలిసినప్పటికీ చాలామంది జాతీయ రహదారుల్లో ప్రయాణించే సమయంలో హెల్మెట్లు వినియోగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఈ కొత్త సంవత్సరంలో ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బయటకు వస్తే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని హితవు పలికారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతిలో పి–4 కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తున్నారు. సమాజంలో వెనుకబడిన 20% జనాభాన్ని 10 శాతం ఉన్న ధనికులు చేతనైన విధంగా ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, పేదవారి పిల్లల చదువుకు ఆర్థిక సహాయం అందించాలన్నారు.
విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు ఈ సంవత్సరం రైతులకు కార్మికులకు పాలకులకు అధికారులకు అందరికీ యోగదాయకమైన అనుకూలమైన సంవత్సరం అన్నారు అనంతరం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు, జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ పంచాంగ కర్తలను ఘనంగా సన్మానించారు. తదుపరి వారు గంటల పంచాంగాన్ని, , శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం పత్రికను ఆవిష్కరించారు.
అనంతరం ఆహుతులందరికీ ఉగాది పచ్చడి, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, మజ్జిగ ప్రసాదాల పంపిణీ చేశారు. ఆగమ శాస్త్రంలో నిష్ణాతులైన అర్చక స్వాములు అగ్నిహోత్రం యుధిష్ఠిర కోదండపాణి, మురికిపూడి సత్యనారాయణ,రొంపిచర్ల విజయ సారధి కృష్ణమాచార్యులు, ఐలూరి మల్లికార్జున రావులను 10,116 రూపాయల నగదు పురస్కారం తోపాటు ప్రశంసా పత్రం జ్ఞాపిక శాలువలతో ఘనంగా సన్మానించారు.
ముఖ్య అర్చకులు ఘంటసాల భాస్కర శర్మ, జూనియర్ అసిస్టెంట్ బొప్పన వీర కోటేశ్వరరావు, కార్య నిర్వహణ అధికారి సింగనపల్లి శ్రీనివాసరావు, అటెండర్ నరహరిశెట్టి సోమశేఖర్, తనిఖీదారులు కోటిపల్లి అనురాధ, నాదస్వరం క్రొవ్విడి శివ బాబు, కార్యనిర్వాహణాధికారి సమ్మెట ఆంజనేయస్వామి లకు ఉగాది సేవా పురస్కారాలు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు.
కవి సమ్మేళనం లో పాల్గొన్న కవులు డాక్టర్ ఏ ఆర్ కే మూర్తి ,జొన్నలగడ్డ గణపతి శాస్త్రి, గుడిసేవ విష్ణు ప్రసాద్, పాణిగ్రాహి రాజశేఖర్, సింహాద్రి పద్మ, చెన్నా ప్రగడ శర్మ, మేరీ కృప భాయి, వక్కలంక రామకృష్ణ, పల్లావజుల వెంకట శైలజ, భవిష్య, ఓలేటి ఉమా సరస్వతి, ముదిగొండ శాస్త్రిలను ఆర్టీసీ చైర్మన్, జిల్లా కలెక్టర్,సంయుక్త కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అప్పికట్ల దీప్తి వీణ వాయిద్య ప్రదర్శన, చింతలపాటి పూర్ణచంద్రరావు శిష్య బృందం ప్రదర్శించిన కోలాటం కూచిపూడి నృత్యం ఆకట్టుకున్నాయి. వారిని కూడా ఆర్టీసీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వెంకట సాంబశివరావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, ఇన్చార్జి ఆర్డిఓ సిహెచ్ పద్మావతి, జడ్పీ డిప్యూటీ సీఎం ఆనంద్ కుమార్ జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, తహసిల్దారు మధుసూదన్ కలెక్టరేట్ ఏవో ఆంజనేయ ప్రసాదు తదితర అధికారులు, పుర ప్రజలు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News