-ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తున్న యంత్రాంగం
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ సదస్సుల నిర్వహణ వెనుక ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతోంది. అధికారులు వచ్చిన వినతులను పరిశీలించి, వాటిలో కొన్నిటిని అప్పటికప్పుడే పరిష్కరిస్తున్నారు. ఏళ్లనాటి నుంచీ పేరుకుపోయిన కొన్ని సమస్యలు ఈ విధంగా తక్షణ పరిష్కారానికి నోచుకోవడంతో, లబ్దిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వినతులను 45 రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించడంతో, అవి కూడా పరిష్కారం అవుతాయన్న నమ్మకం అర్జీదారుల్లో కలుగుతోంది.
అర్జీల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రత్యేక దృష్టి సారించారు. అవకాశం ఉన్నవాటిని అప్పటికప్పుడే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన బొండపల్లి మండలం గొట్లాంలో, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కణపాక అయ్యన్నపేట గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో శుక్రవారం పాల్గొన్నారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకొని, తక్షణ పరిష్కారానికి ఆదేశించారు. అప్పటికప్పుడు క్షేత్రస్థాయి తనిఖీలకు ఆదేశించి, కొన్ని సమస్యలకు పరిష్కారం చూపించారు. కలెక్టర్ చూపించిన చొరవతో తమ సమస్యలు పరిష్కారం అవ్వడంతో, అర్జీలు సమర్పించినవారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
గొట్లాంలో :
గొట్లాం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మొత్తం 16 అర్జీలు అందగా, వీటిలో 7 అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమకు 2014లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు పోయాయని, డూప్లికేట్ పట్టాల కోసం ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం రాలేదని గ్రామంలోని సిగడం వీధికి చెందిన లబ్దిదారులు షేక్ పార్వతి, తాడ్డి మంగ, వెలుగు అప్పలరాజు, జుజ్జూరు సాంబమూర్తి, లల్ల హైందవి వాపోయారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, వెంటనే వారికి డూప్లికేట్ పొజిషిన్ పట్టాలను మంజూరు చేయాలని తాసిల్దార్ డోల రాజేశ్వర్రావును ఆదేశించారు. దీంతో తక్షణమే తాసిల్దార్ స్పందించి, సర్వేయర్, డిప్యుటీ తాసిల్దార్, ఆర్ఐల ఆద్వర్యంలో మూడు బృందాలను ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయికి వెళ్లి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వారు గ్రామంలోకి వెళ్లి, ఇళ్లను పరిశీలించి నివేదిక ఇవ్వడంతో, అప్పటికప్పుడే డూప్లికేట్ పట్టాలను అందజేశారు. అదేవిధంగా జాయింట్ ఎల్‌పిఎం ఉండటంతో, తమ పంటకు ఈ క్రాప్ అవ్వడం లేదని, రైతు భరోసా కూడా అందలేదని తాళ్లపూడి సత్యనారాయణ, ఉల్లి వెంకట రమణ ఫిర్యాదు చేశారు. వెంటనే వీరి దరఖాస్తును ఆన్‌లైన్లో నమోదు చేసి, 24 గంటల్లోగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. కుటుంబ వివాదం కారణంగా చాలా కాలంగా ఫ్యామిలీ సర్టిఫికేట్‌కోసం రాకపోవడంతో, కాళ్లు అరిగేలా తిరుగుతున్న తాళ్లపూడి అప్పలనరసమ్మ సమస్యకు తక్షణ పరిష్కారం చూపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులతో తాసిల్దార్ మాట్లాడి ఒప్పందానికి వచ్చేటట్టు చేయడంతో, వారికి ఫ్యామిలీ సర్టిఫికేట్ మంజూరుకు మార్గం సుగమమయ్యింది.
విజయనగరం కార్పొరేషన్ లో :
కార్పొరేషన్ పరిధిలోని అయ్యన్నపేట గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొని, కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఇక్కడ మొత్తం 31 దరఖాస్తులు అందాయి. వీటిలో డిజిటల్ సిగ్నేచర్ లేదని గ్రామానికి చెందిన ఎనుముల స్వామినాయుడు, కర్రోతు ప్రభ అర్జీలు సమర్పించారు. కలెక్టర్ ఆదేశాలమేరకు ఆ రెండు దరఖాస్తులను తహసీల్దార్ కుర్మనాధరావు పరిశీలించి, వెంటనే పరిష్కరించారు.
Prajavartha Online Telugu News