-రోడ్ల మరమ్మతుల పనుల ప్రగతిపై ఆర్ & బీ శాఖ అధికారులతో మంత్రి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం
-మరమ్మతు పనుల్లో వెనుకబడ్డ డివిజన్ అధికారులపై కఠిన చర్యలుంటాయన్న మంత్రి
-వారాల వారీగా టార్గెట్ ఫిక్స్ చేసుకోని పనులు చేయాలని అధికారులకు సూచన
-ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించవద్దన్న మంత్రి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి పండుగ నాటికి గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా రహదారుల మరమ్మతు పనులను మరింత ముమ్మరం చేయాలని ఆర్ & బీ శాఖ అధికారులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం మేరకు ఒక నెల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. నిర్ధిష్ట కాల వ్యవధిలో పనులను పూర్తి చేసేలా.. ప్రణాళికలు రచించుకుని ముందుకు సాగాలని మంత్రి అధికారులకు సూచించారు. నేడు విజయవాడలోని ఈ ఎన్ సీ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొనడం జరిగింది..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 5 ఏళ్ల పాటు నరకయాతన చూసిన ప్రజలకు మెరుగైన రహదారులు కల్పించాలనే లక్ష్యంతో.. రోడ్ల మరమ్మత్తులకు సంబంధించిన పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయడానికి నిర్థిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.. రోడ్ల మరమ్మతుల పనులకు సంబంధించి డివిజన్ల వారీగా క్షేత్రస్థాయి నుంచి అందుతున్న రోజు వారి ప్రగతి వివరాలపై ఈ సందర్భంగా మంత్రి ఆరా తీశారు.. రాష్ట్రంలోని మొత్తం 45,378 కి.మీ మేర రాష్ట్ర మరియు జిల్లా ప్రధాన రోడ్లు ఉండగా, అందులో 22,299 కి.మీ రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. మొత్తంగా రూ. 861 కోట్లతో చేపట్టిన రోడ్ల మరమ్మతులకు సంబంధించి 2468 కి.మీ మేర రోడ్లను గుంతల రహిత రహదారులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు..
ఇప్పటికే ముఖ్యమంత్రి సైతం రోడ్ల ప్రగతిపై ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వివరాలను ఆరా తీస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు మరింత నిబద్ధత పనిచేయడం ద్వారానే సకాలంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమన్నారు.. కొన్ని జిల్లాల్లో రోడ్ల మరమ్మతుల పనులు వెనుకబడి ఉండటంపై మంత్రి సంబంధిత డివిజన్ అధికారులపై సీరియస్ అయ్యారు.. ప్రభుత్వం రోడ్ల విషయంలో సీరియస్ గా ఉన్న నేపథ్యంలో సకాలంలో పనులు పూర్తి చేయకపోతే అధికారులపై చర్యల తీసుకోక తప్పదని మంత్రి హెచ్చరించడం జరిగింది..
ఇటీవల కాలంలో ఈశాన్య రుతుపవనాల కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కురిసిన వర్షాలతో ఆయా ప్రాంతాల్లో పనుల్లో కొంత జాప్యం జరిగిందని, ఇకపై ఆయా ప్రాంతాల్లోనూ మరింత ముమ్మరంగా పనులు ప్రారంభించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత డివిజన్ల అధికారులకు మంత్రి సూచించారు. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిన నేపథ్యంలో రోడ్ల మరమ్మతు పనులను వేగవంతం చేసే విధంగా ముందుకు సాగాలన్నారు..
ఇకపై రోడ్ల మరమ్మతుల కోసం చేయబోయే పనులను వారం రోజులకు ఒకసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుని అందుకనుగుణంగా పనిచేయాలన్నారు.. రేపు మరొకసారి వారాల వారీ ప్రణాళికలు – టార్గెట్ కు సంబంధించి సమీక్ష చేస్తానని, అందరూ అందుకనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని.. ఏ వారంలో ఎన్ని కి.మీ పనులు చేయాగలరో టార్గెట్ పిక్స్ చేసుకుని నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. నూతన సంవత్సరంలో రాష్ట్రంలో రోడ్లకు సంబంధించి ఎటువంటి విమర్శలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో పనితీరు ఉండాలన్నారు..
రోడ్లకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని.. అర్జీలను పెండింగ్ లో ఉంచడం సరికాదని, ఈ విషయంలో అలసత్వం వహించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయన్నారు.. సంక్రాంతి నాటికి గుంతల రహిత రోడ్లే లక్ష్యంగా మిషన్ మోడ్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తోందని, అదే సమయంలో రోడ్ల నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.. రోజు వారీ రోడ్ల పనుల ప్రగతికి సంబంధించి అప్ డేట్స్ అందిస్తూ.. ఎక్కడైనా లోపాలుంటే ఆయా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకొచ్చి తక్షణమే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఈ ఎన్ సీ నయిముల్లా, ఇతర ఆర్ & బీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News