-భూ సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు..
-ఇప్పటివరకు (09.12.2024) 1,012 రెవెన్యూ సదస్సులు నిర్వహించిన ప్రభుత్వం..
-ఇప్పటివరకు (09.12.2024) రెవెన్యూ సదస్సులకు హాజరైన 62,868 మంది ప్రజలు..
-ఇప్పటివరకు 19,403 అర్జీలు/ఫిర్యాదుల స్వీకరణ.. 170 సమస్యలకు తక్షణ పరిష్కారం..
-నాలుగో రోజు రెవెన్యూ సదస్సుల్లో పాల్గొన్న మంత్రి సవిత, పలువురు ఎమ్మెల్యేలు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భూ సమస్యలను పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో అధికారులకు పెద్దఎత్తున వినతులు/ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ సదస్సులు శుక్రవారం (06.12.2024) నుంచి ప్రారంభంకాగా జనవరి 8వ తేదీ వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో ప్రజల నుంచి అందిన వినతులను వెంటనే పరిశీలించి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సదస్సులు నిర్వహించనున్నారు. ఈ సదస్సుల్లో తహసీల్దార్, ఇతర సిబ్బంది కూడా అందుబాటులో ఉంటున్నారు.
మూడో రోజు (08.12.2024) 695 సదస్సులు నిర్వహించగా.. నాలుగో రోజు (09.12.2024) నాటికి మొత్తం 1,012 రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహించింది. ఇప్పటివరకు ఈ రెవెన్యూ సదస్సులకు 62,868 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ నాలుగు రోజుల్లో మొత్తం 19,403 వినతుల స్వీకరించగా.. 170 సమస్యలకు ప్రభుత్వం తక్షణ పరిష్కారం చూపించింది.
రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన 19,403 వినతులు/ఫిర్యాదుల్లో హక్కుల రికార్డు RoR (7207), అస్సైన్‌మెంట్ హౌస్ సైట్స్ (1116), ఏజెన్సీ ల్యాండ్ ప్రాబ్లమ్స్ (872), అస్సైన్‌మెంట్ ప్రభుత్వ భూమి (751), రీసర్వే గ్రీవెన్స్ (710), బౌండరీ డెమాక్రేషన్ (658), రీసర్వే-SSLR (416), ఎఫ్-లైన్ పిటిషన్స్ (319), 22A భూములు (280), రెవెన్యూ గ్రీవెన్స్ (234), ఇతరమైనవి (6849) ఉన్నాయి.
ఇక నాలుగో రోజులో (09.12.2024) భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం దొరసానిపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో రాష్ట్ర బీసీ వెల్ఫేర్ శాఖామాత్యులు మంత్రి ఎస్.సవిత, ఎమ్మెల్యేలు ఎన్. వరదరాజులరెడ్డి, సి. ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. గోపాలపట్నం మండలం బుచ్చిరాజుపేట గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే గణబాబు, అనకాపల్లి జిల్లా పరవాడ మండలం బర్నికం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News