-పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
-మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించి మంత్రి నారా లోకేష్
-విద్యార్ధులతో కలిసి భోజనం చేసిన మంత్రి లోకేష్, ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా, యార్లగడ్డ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ జూనియర్ కళాశాలను తీర్చిదిద్దటంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎనలేని కృషి చేస్తున్నారు. విద్యా శాఖ మంత్రిగా నారాలోకేష్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు విద్యా వ్యవస్థ లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి నారా లోకేష్ కి ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి ఎంపి కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు. అలాగే సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ కి వీడ్కోలు పలికారు.
ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలు నివసించే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించటం చాలా ఆనందం వుందన్నారు. గతంలో టిడిపి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించగా, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రారంభించిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్ కే దక్కుతుందన్నారు.
విద్యాశాఖ మంత్రి గా లోకేష్ బాధ్యతలు తీసుకున్నప్పుడు చాలా కష్టమైన పదవి….ఎలానెగ్గుకొస్తాడోనని కొంచెం కంగారు పడ్డాము. కానీ విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థ లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించటం చాలా కష్టతరం…ఈ బాధ్యతలు తీసుకున్నప్పుడు నారా లోకేష్ ఈ శాఖతో ఇబ్బంది పడతాడెమో అనుకున్నాము..కానీ చాలా అనుభవం వున్న నాయకుడిలా విద్యాశాఖను నడిపిస్తున్నారని కొనియాడారు.
కార్పొరేట్ స్కూల్స్ లో ఉండే మెగా పేరేంటింగ్ కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన ఘనత మంత్రి నారా లోకేష్ సొంతం చేసుకున్నారని తెలిపారు. ఇక పై ప్రతి ఆరునెలకొకసారి ఈ మెగా పేరేంటింగ్ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో జరిగేలా ప్రణాళిక సిద్దం చేశారన్నారు. విద్యార్ధులకు ఎటువంటి ఆలస్యం కాకుండా గైడ్స్ , టెక్ట్స్ బుక్స్ అందించే విధంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు.
ఇక విద్యార్ధులు ఎమ్.పి.సి, బై.పి.సి కోర్సులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా సి.ఈ.సి. హెచ్.ఈ.సీ. ఎమ్.ఈ.సీ కోర్సులను కూడా ఎంచుకోవాలన్నారు. సైన్స్ గ్రూప్స్ తో పాటు ఆర్ట్స్ గ్రూప్స్ కి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వున్నాయన్నారు. విద్యార్ధులకు కమ్యూనికేషన్స్ స్కిల్స్ చాలా ముఖ్యమని వాటి పెంపొందించుకోవటానికి సాధన చేయాలని సూచించారు. విద్యార్ధులు పెద్దలను చూసి స్పూర్తి పొందాలన్నారు. ఎంత ఎదిగిన ఒదిగి వుండే లక్షణాలను అలవర్చుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.
Prajavartha Online Telugu News