-నియోజకవర్గాల స్థాయిలో పంపిణీకి ఏర్పాట్లు చేయండి
-ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాలకు చర్యలు
-45 ఏళ్లు పైబడిన గ్రామీణులందరికీ ఉచిత కంటి పరీక్షల్ని చేసేందుకు కార్యాచరణ
-ఎన్ హెచ్ ఎం నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలి
-ఎన్ హెచ్ ఎం కార్యక్రమాలన్నీ క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి
-సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
-గిరిజన ప్రాంతాల్లో మందుల పంపిణీ, టెస్టులకు డ్రోన్లను వాడాలి
-జనాభా పెరుగుదలకు అవగాహన కల్పించాలి
-ఎన్ హెచ్ ఎం కార్యక్రమాల సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 5 నుండి 15 ఏళ్ల మధ్య వయసు గల పాఠశాల విద్యార్థులకు 90 వేల కళ్లద్దాలను పంపిణీచేసేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. నియోజకవర్గాల స్థాయిలో పంపిణీకి ఏర్పాట్లు చేయాలని, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాల్ని నిర్వహించాలని మంత్రి సూచించారు. అలాగే, 45 ఏళ్లు పైబడిన గ్రామీణులందరికీ ఉచిత కంటి పరీక్షల్ని చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. నేత్రదానాన్ని ప్రోత్సహించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, జిల్లాల్లోని అన్ని చోట్లా కార్నియాల సేకరణకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) కింద అమలవుతున్న పలు కార్యక్రమాలపై శనివారం నాడు మంగళగిరి ఎపిఐఐసి టవర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ మరియు నేషనల్ హెల్త్ మిషన్ ఎం.డి వాకాటి కరుణ కార్యక్రమాలు అమలవుతున్న తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. జనాభా పెరుగుదలకు వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
కేంద్రప్రభుత్వం నుండి వచ్చే నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) నిధుల్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఎన్‌హెచ్ ఎం కార్యక్రమాలన్నీ క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా పటిష్టమైన చర్యల్ని తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ పథకాలు, కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముద్రించే కరపత్రాలు, పోస్టర్లను కేవలం ఆసుపత్రుల గోడలకు పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలోకి వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న చిన్న వీడియోలు, రేడియో జింగిల్స్ వంటివి సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేయాలన్నారు.
గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నీటి సంబంధిత వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన చర్యల్ని తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ విజయగాథల్ని (పాజిటివ్ స్టోరీస్) మీడియాకు వివరించాలన్నారు . సికిల్ సెల్ ఎనీమియాను నియంత్రించాలన్నారు. గర్భిణిలు, బాలికల్లో రక్త హీనత పై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధుల పట్ల సర్వే కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. డేటాను ఇంటిగ్రేట్ చేయాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు.
అసాధారణ వ్యాధులు( రేర్ డిసీజెస్) విషయంలో కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించాలన్నారు. ఇందుకు సంబంధించిన నిపుణుల్ని సంప్రదించాలన్నారు. మాతృ, శిశు మరణాల్ని తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కేరళ రాష్ట్రంతో పోల్చుకుంటే మనం చాలా వెనుకబడి ఉన్నామని, ఇతర రాష్ట్రాల్లో కూడా పరిశీలించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలకు సంబంధించి పంచాయాతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై త్వరిత గతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి ప్రతి జిల్లాలోనూ కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, కౌన్సిలర్లను నియమించాలని మంత్రి ఆదేశించారు. మానసిక సమస్యలకు సంబంధించి టెలీమానస్ కు ఎటువంటి కాల్స్ వస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి ఆరా తీశారు. వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వాసు పత్రుల్లో క్రిటికల్ కేర్ పరికరాల్ని సకాలంలో రిపేర్ చేయడంలేదన్న ఫిర్యాదులొస్తున్నాయని, దాన్ని సరిచేసేందుకు పూర్తి పర్యవేక్షణ ఉండాలన్నారు. ఫిర్యాదులొచ్చిన 24 గంటల్లో రిపేర్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎపిపిఎస్సీ ద్వారా అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ల నియామకాలు లేటవుతున్నందున, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఎపిపిఎస్‌సి అధికారుల్ని వెంటనే సంప్రదించాలని ఆదేశించారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, ఎన్ ఎహెచ్ ఎం సిఎఓ గణపతిరావు, ఎడీలు, డీడీలు, ప్రోగ్రాం ఆఫీసర్లు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News