ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి
-నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి
-నేతన్నలకు 365 రోజులు పని కల్పించడమే లక్ష్యం
-సంక్రాంతికి చేనేత వస్త్రాలు ధరించుదాం : మంత్రి సవిత పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కలిగించేలా ప్రతి నెలా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఎగ్జిబిషన్లు, ఎక్స్ పోలు నిర్వహణతో చేనేత వస్త్రాలు విక్రయాలు పెరిగాయాని మంత్రి తెలిపారు. గురువారం ఆమె విజయవాడ నగరంలోని ఓ కన్వన్షెన్ సెంటర్లో నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో(Niche Handloom Expo 2024-25) ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్ పో లో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి, ఏ రాష్ట్రం నుంచి వచ్చారు…అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి..? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఎంతో కీలకమైన చేనేతకు సీఎం చంద్రబాబు అండగా ఉంటున్నారన్నారు. నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించడానికి రాష్ట్రంలోనూ, దేశ విదేశాల్లోనూ చేనేత ఎక్స్ పోలు, ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ వీవర్స్ సర్వీస్ సెంటర్, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పోను నిర్వహిస్తున్నామన్నారు. వారం రోజుల పాటు నిర్వహించే ఈ ఎక్స్ పోలో 49 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంతో పాటు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీర్, బీహార్ కు చెందిన 49 మంది చేనేత కార్మికులు, సొసైటీలు స్టాళ్లు ఏర్పాటు చేశాయన్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి దృష్టికి రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలను తీసుకెళ్లినట్లు మంత్రి వెల్లడించారు.

చేనేతతో సంక్రాంతిని చేసుకుందాం…
చేనేత వస్త్రాలు తెలుగు సంప్రదాయానికి ప్రతీక అని మంత్రి సవిత తెలిపారు. రాబోయే సంక్రాంతికి ప్రజలంతా చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలని పిలుపునిచ్చారు. తెలుగింటి పెద్దపండగ సంక్రాంతిని చేనేతతో జరుపుకుందామన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలవాలని మంత్రి సవిత కోరారు.

365 రోజులూ పని కల్పిస్తాం…

చేనేత కార్మికులకు గౌరవ ప్రదమైన జీవనం కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. నీచే హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో సందర్శించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి సవిత మాట్లాడారు. రాష్ట్రంలో ఉప్పాడ జాంధాని చీరలు, మంగళగిరి చీరలు, వెంకటగిరి చీరలు, ధర్మవరం పట్టు చీరలు…ఇలా రాష్ట్రంలో 35 రకాల నాణ్యమైన చేనేత వస్త్రాలను నేతన్నలను తయారు చేస్తున్నారన్నారు. ఇలా తయారు చేస్తున్న చేనేత వస్త్రాలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ వీవర్స్ సర్వీస్ సెంటర్, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. చేనేతకు చంద్రబాబు పాలన ఎప్పుడూ స్వర్ణయుగమేనని మంత్రి తెలిపారు. గడిచిన 6 నెలల కాలంలో మూడు ఆప్కో షోరూమ్ లను కొత్తగా ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మరికొన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 10 క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు ఆదిత్య బిర్లా గ్రూప్ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. చేనేత వస్త్రాల అమ్మకాలకు, నేతన్నలకు 365 రోజుల పాటు పని కల్పించేలా టాటా సంస్థతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. ఇప్పటికే ఆ సంస్థ ఆధ్వర్యంలో కార్యకలాపాలు ప్రారంభించామన్నారు. త్వరలో 5 శాతం జీఎస్టీ రియింబర్స్ మెంట్ కు చర్యలు తీసుకుంటామన్నారు. మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేయనున్నట్లు తెలిపారు. నూలు కొనుగోలుకు నేతన్నలకు 15 శాతం సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకం వర్తింప చేస్తున్నామన్నారు. త్రిఫ్ట్ ఫండ్, వీవర్స్ ముద్ర పథకాలు అమలు చేస్తున్నామన్నారు. పవర్ లూమ్ యూనిట్లకు 50 శాతం రాయితీ అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఎమ్మిగనూరుతో పాటు రాయదుర్గం, మైలవరం, పామిడిలోనూ టెక్స్ టైల్స్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని, చీరాలలో హ్యాండ్లూమ్ పార్క్ తో పాటు టెక్స్ టైల్స్ పార్కు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నూతన టెక్స్ టైల్స్ పాలసీ అమలు చేయబోతున్నామన్నారు. కూటమి ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం చేనేత కార్మికుల్లో ఏర్పడిందని మంత్రి సవిత వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆప్కో ఎండీ పావనమూర్తి, వీవర్స్ సర్వీస్ సెంటర్ డీడీ సాహూ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీఎం దార్శ‌నిక‌త‌కు నిద‌ర్శ‌నం ఆర్టీజీఎస్‌

-క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి డాటా ఎంతో ముఖ్యం -ప్ర‌భుత్వ ప‌నితీరులో ఆర్టీజీ స‌హ‌కారం ఎంతో అవ‌స‌రం -పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *