మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో శానిటేషన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ అధికారులను, శానిటేషన్ సిబ్బందిని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉదయం స్థానిక 45, 46 డివిజన్లలో పర్యటించి ఇంటింటి చెత్త సేకరణ ఎలా జరుగుతున్నది? పరిశీలించారు. చెత్త సేకరించే సమయంలో తడి /పొడి చెత్త వేరు చేయించి సేకరించాలని సిబ్బందికి సూచించారు. ఇంటింటి చెత్త సేకరణ జరుగుతున్నప్పటికీ రోడ్ల వెంబడి చెత్త ఎవరు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారని, శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈడేపల్లి చిన్న శక్తి గుడి రోడ్డులో రోడ్డు వెంబడి చెత్త, అపరిశుభ్రత పరిశీలించిన కలెక్టర్ శానిటేషన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రజలు తడి పొడి చెత్త వేరు చేసి శానిటేషన్ సిబ్బందికి అందించేలా వారిలో అవగాహన కల్పించాలన్నారు. ఎక్కువగా చెత్త వేస్తున్న గార్బేజ్ స్పాట్స్ గుర్తించి, ఎవరు వేస్తున్నారో తెలియడం లేదని, అట్టివారిని గుర్తించేందుకు అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం జరగాలని కమిషనర్ను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని, ఇందులో భాగంగా స్వచ్ఛ మచిలీపట్నం, సుందర మచిలీపట్నం సాధనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు.
నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గోపీచంద్, వార్డు ఇన్చార్జి పివి ఫణి కుమార్ మున్సిపల్ సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు
Prajavartha Online Telugu News