Breaking News

కోడూరు మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్

కోడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోడూరు మండలంలో పర్యటించి మండలంలోని ఉల్లిపాలెంలో అంగన్వాడీ కేంద్రం, మండలపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మొదటగా జిల్లా కలెక్టర్ ఉల్లిపాలెంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, బరువును నమోదు చేసే రిజిస్టర్లు, అదేవిధంగా పిల్లలకు పెడుతున్న మెనూపై ఆరా తీసి నాణ్యతను పరిశీలించారు.

ఈ క్రమంలో ఆయన బరువు తూచే యంత్రంపై పిల్లలను స్వయంగా ఉంచి బరువును రిజిస్టరులో నమోదు చేసిన సంఖ్యలను పరిశీలించారు. రెండిటికి వ్యత్యాసం ఉండటంతో ఆయన అంగన్వాడి కార్యకర్త, సిడిపిఓ, అంగన్వాడి సూపర్వైజర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా పిల్లలకు ప్రాథమిక అంశాలు సరిగా నేర్పించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. పిల్లలు పోషకాహారలోపం బారిన పడకుండా, ఆటపాటలు నేర్పించి వారి ఎదుగుదలకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, బాధ్యతగా వ్యవహరించి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

అనంతరం ఆయన ఉల్లిపాలెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజు భోజనం సిద్ధం చేస్తున్నదీ లేనిదీ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆయన విద్యార్థులతో కలిసి భుజించారు. భోజనం చాలా రుచిగా ఉందని, నాణ్యత సైతం బాగుందని ఇది ఇలాగే కొనసాగించాలని నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

పిదప ఆయన కోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభా) కార్డుల పంపిణీ, పీహెచ్సీలో డెలివరీలు, ల్యాబ్ లో వైద్య పరీక్షల వివరాలపై ఆరా తీశారు. రక్తహీనత (ఎనీమియా) బాధితులకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. అనంతరం ఆయన కోడూరు గ్రామంలో టీబీ బాధితుని పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అర్జీదారులకు భరోసా కల్పించిన జిల్లా కలెక్టర్..
జిల్లా కలెక్టర్ మండలంలో పర్యటించే క్రమంలో పలువురు ఆయనకు సమస్యలను విన్నవించారు. ఆయన వారి సమస్యలను సావధానంగా ఆలకించి వారికి భరోసా కల్పించారు.

ఉల్లిపాలెం గ్రామానికి చెందిన మద్దాల శ్యామల, మాచర్ల సంపూర్ణమ్మ ఇరువురు వృద్ధులు తమకు ఇంటి స్థలం మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు విన్నవించగా వారి అర్హతను పరిశీలించి నివేదిక సమర్పించాలని తహసిల్దార్ కు కలెక్టర్ సూచించారు.

అదే గ్రామానికి చెందిన కూనపురెడ్డి శివనాగరాజు తన ఇంటి స్థలం, డొంక స్థలానికి సంబంధించిన సరిహద్దు విషయంలో తగు న్యాయం చేయాలని కలెక్టర్కు విన్నవించగా, ఆ ప్రాంతాన్ని సందర్శించి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ రెవిన్యూ అధికారులకు సూచించారు.

స్వతంత్రపురం గ్రామానికి చెందిన పులిగడ్డ నాగమణి తన సోదరుడు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కలెక్టర్కు విన్నవించారు. ఆయన ఫోనులో మచిలీపట్నంలోని వైద్యాధికారులతో మాట్లాడి సంబంధిత వ్యక్తికి పింఛను మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అంగన్వాడి కేంద్రాల పర్యవేక్షణ అధికారి మురళీ కిషోర్, వైద్య విభాగం పర్యవేక్షణ అధికారి ఎల్ నిత్యానందం, విద్య పర్యవేక్షణ అధికారి హజీ బేగ్, కోడూరు ఎంపీడీవో ప్రవీణ్, తహసిల్దార్ బి శ్రీను నాయక్, అంగన్వాడి సూపర్వైజర్ పి ఆర్ రాజేశ్వరి, సిడిపిఓ శేషు కుమారి, ప్రధానోపాధ్యాయులు నీరజ, డాక్టర్ శిరీష, ఇతర అధికారులు కలెక్టర్ తో పాటు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *