విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతిలో అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థలలో చిత్తడి నేలలు ప్రధానమైనవి. ఈ రోజు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఈ సందర్భంగా పర్యావరణంలో చిత్తడి భూముల ప్రాధాన్యాన్ని అందరం గుర్తించాలి. ఇవి సహజ నీటి శుద్ధి కేంద్రాలు… కార్బన్ నిల్వ కేంద్రాలు, వర్షపు నీటిని భూగర్భానికి చేరుస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడే అసాధారణమైన ప్రదేశాలు. ఈ భూములు భూకంప ఉద్ధృతిని తగ్గించడంలో, వాతావరణ మార్పులను నియంత్రించడంలో, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 25,000 పైగా చిత్తడి నేలలు ఉన్నాయి. వీటిలో ప్రముఖమైనది కొల్లేరు సరస్సు. ఇది రామ్‌సర్ సైట్‌గా గుర్తింపు పొందిన భారతదేశంలోని అతి పెద్ద తీపినీటి సరస్సులలో ఒకటి. అలాగే, దేశంలో రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సైన పులికాట్ సరస్సు, సముద్ర జీవజాలానికి కీలకమైన ఉప్పుటేరు వాతావరణ వ్యవస్థ కూడా ఉన్నాయి. ఈ భూములు పక్షుల సంరక్షణకు, మత్స్య సంపదకు మాత్రమే కాదు… వ్యవసాయానికి ఉపయోగపడుతూ వేలాది మంది ప్రజలకు జీవనాధారం అందిస్తున్నాయి.
ఈ విలువైన వనరులను రక్షించడానికి మన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఆక్రమణలను నివారించేందుకు, భౌగోళిక పరిమితులను ఖచ్చితంగా నిర్థారించేందుకు కృషి జరుగుతోంది. అయితే, పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు… మన అందరి బాధ్యత. మనం దానిని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలి.
స్వప్రయోజనాలను తగ్గించుకోవడం ద్వారా మాత్రమే ప్రకృతిని కాపాడగలం. ప్రతి చిన్న ప్రయత్నం సమష్టిగా మొదలైతే పెద్ద మార్పుకు దారి తీస్తుంది. అవగాహన, ప్రామాణికమైన పద్ధతులు, ప్రకృతిపట్ల గౌరవం కలిగినప్పుడు మాత్రమే ఈ విలువైన పర్యావరణ వ్యవస్థలను రాబోయే తరాలకు అందించగలం. మన భవిష్యత్తు కోసం మనం ఈ రోజు నుంచే కార్యాచరణ ప్రారంభిద్దాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
Prajavartha Online Telugu News