గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని రోడ్ల పై నాటు కోళ్ళు, చేపల అనధికార విక్రయాల పై ప్రజారోగ్యం దృష్ట్యా కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. ఆదివారం నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు బృందాలుగా ఏర్పడి నగరంలోని చుట్టుగుంట, నల్లపాడు రోడ్డు,మిర్చియార్డ్, ఆర్.టి.ఓ ఆఫీసు, గుజ్జనగుండ్ల, అమరావతి రోడ్డు మరియు పట్టాభిపురం ప్రాంతాలలో రోడ్ల పై అనధికారికంగా చేపలు, నాటుకోళ్ళు మరియు మేకలను వధించి విక్రయిస్తున్న వారిని గుర్తించి వారి పై దాడులు నిర్వహించి వాటిని తొలగించి, అపరాధ రుసుము క్రింద 12,500 రూపాయలను విధించామని తెలిపారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, నగర పరిధిలో ఎక్కడైనా అనధికారికంగా నాటుకోళ్ళు, చేపలు మరియు మాంసం విక్రయాలు జరుపు వారిపై కఠిన చర్యలు, భారీమొత్తంలో అపరాధ రుసుము విధించుటయే కాక వారి పై చట్టప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకొనుట జరుగుతుందని హెచ్చరించారు. నగరంలో మాంసం విక్రయాలు జరుపు యజమానులు సంబంధిత డాకుమెంట్స్ అందజేసి డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ పొంది వ్యాపారం నిర్వహించుకోవాలని, లైసెన్స్ లేని వారి షాపులను సీజ్ చేయుట జరుగుతుందని తెలిపారు. నగరంలో అనధికార మాంస విక్రయాలను అరికట్టుటకు నగర పాలక సంస్థ శానిటరీ ఇన్స్పెక్టర్లు బృందాలుగా ఏర్పడి సదరు షాప్ ల పై దాడులు నిర్వహించుట జరుగుతుందని తెలిపారు.
మాంసం విక్రయించు షాపుల యజమానులు షాపు చుట్టు ప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాంసం పై దుమ్ము, ధూళి పడకుండా మెస్ లను కట్టి ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలని తెలియచేశారు. అంతేకాక శుభ్రత పాటించని షాపుల పై ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామని తెలియచేశారు.
సదరు కార్యక్రమంలో యం.హెచ్.ఓ డాక్టర్ రవిబాబు, వెటర్నరి డాక్టర్ వెంకటేశ్వర్లు, యస్.యస్ ఆనందకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సి.హెచ్ శ్రీనివాస్, నాగేశ్వర రావు, రాము, దాస్ ఇతర ప్రజారోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News