-కూటమి ప్రభుత్వం అద్వితీయమైన పరిపాలన అందిస్తోంది
-వైసీపీ నాయకులు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు
-అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా నోరు జారి… ఇప్పుడు కుంటి సాకులా..?
-సామాజిక వేదికలపై, ఇళ్ళల్లో కూర్చొని కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి
-ఖనిజాలను దోచుకునే మాఫియా అంతు చూస్తానని ప్రధాని మోదీ కలికిరిలో చేసిన ప్రకటన త్వరలోనే అమలవుతుంది
-పుంగనూరు బహిరంగ సభలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రెండు లక్షల మందికిపైగా ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే శాసనసభకు హాజరు కాకుండా, పుంగనూరు నియోజకవర్గం ప్రజల గొంతుకను నొక్కి పెడుతున్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. ఆదివారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో జనసేన నాయకులు ఎన్. వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో నాగబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుంగనూరు నియోజకవర్గం శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, ఆక్రమణలు, దోపిడీల చిట్టాను నాగబాబు బహిర్గతం చేశారు. వైసీపీకి 11 సీట్లు ఇచ్చి గెలిపించిన 20 లక్షల మందికి పైగా ప్రజల గొంతుకను శాసన సభలో వినిపించకుండా మోసం చేస్తున్నారని, సభలో మాకు మైకు ఇవ్వరని అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మీరు సభకు హాజరైతే కదా మైకులు ఇస్తారా, లేదా అని తెలిసేదని అన్నారు. శాసన సభకు హాజరు కాకపోగా కూటమి ప్రభుత్వం గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ, చీకట్లో బాణాలు వేస్తున్నారని, వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు అన్నీ వెలికి తీసి న్యాయస్థానంలో నిలబెడతామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అద్వితీయమైన పరిపాలన అందిస్తోందని, 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం పరిపాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కళ్ళు మూసుకుని బలవంతంగా నిద్రపోతున్నట్టు నటిస్తున్న వైసీపీ నాయకులను ఎవరూ మార్చలేమని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా నోరు పారేసుకున్న వైసీపీ నాయకులు ఇప్పుడు కుంటి సాకులు చెబుతున్నారని, సామాజిక వేదికలు, ఇళ్ళల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని హితవు పలికారు. గత ఎన్నికల సమయంలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేసినప్పటికీ, పిఠాపురంలో పూర్తి సమయం కేటాయించాల్సిన కారణంగా పుంగనూరు రాలేక పోయానని, ఇకపై అవకాశం దొరికినప్పుడల్లా పుంగనూరు వస్తానని అన్నారు. అడవులను ఆక్రమించి, ఖనిజాలను దోచుకునే మాఫియా అంతు చూస్తానని కలికిరి బహిరంగసభలో మోదీ ప్రకటించారని, ప్రధాన మంత్రి మోదీ గారు ప్రకటన త్వరలోనే తప్పనిసరిగా అమలవుతుందని, ఆ సమయం కోసం ఎదురు చూద్దామని చెప్పారు.
జనసేన పార్టీ కాన్ ప్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్ మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గం అంటే గతంలో గౌరవం, మర్యాద, మంచి పేరు ఉండేదని, వైసీపీ పరిపాలన మొదలైన దగ్గర నుండి పుంగనూరు అంటే బెదిరింపులకు అడ్డాగా మార్చేసారని అన్నారు. ఇకపై మీ ఆగడాలు ఆపకపోతే మీకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని చెప్పారు. తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ దురాగతాలను తరిమి కొడతానని ప్రకటించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే కూటమిలో కీలక భూమిక పోషించి వైసీపీని ఓడించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్నారని అన్నారు. చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, భారత దేశంలోనే రాజకీయ ముఖ చిత్రం మార్చేసిన పవన్ కళ్యాణ్ అతి తొందరలో పుంగనూరులో స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న దురాగతాలను అరికడతారని అన్నారు. జనసేన నాయకులు ఎన్. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశభక్తి, అంకితభావం కలిగిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టడం సంతోషంగా ఉందని అన్నారు. జనసేన నాయకులు కిరణ్ రాయల్, కీర్తన, సుభాషిణి, వినుత కోట, రామ్ దాస్ చౌదరి, మై ఫోర్స్ మహేష్, చిరువేలు గంగాధర్, పగడాల రమణ, సోమశేఖర్, మధుబాబు, కవిత, అనిత, దినేష్, యుగంధర్, అమర్ నారాయణ, దేవర మనోహర్, మహేష్, టీడీపీ పుంగనూరు నియోజకవర్గం ఇన్చార్జి చల్లా రామచంద్రా రెడ్డి, బీజేపీ పుంగనూరు నియోజకవర్గం ఇన్చార్జి గన్నామదన్ మోహన్, చిత్తూరు జిల్లా జనసేన నాయకులు, పుంగనూరు నియోజకవర్గం నాయకులు, జన సైనికులు, వీర మహిళలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News