గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, సచివాలయ కార్యదర్శులు ప్రజల నుండి అందే ఫిర్యాదులు, ఆర్జీల పట్ల భాధ్యతగా వ్యవహరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. మంగళవారం కమిషనర్ గారు నల్లపాడు శ్రీనివాస కాలనీ నివాసితులు మౌలిక వసతులు కోరుతూ అందించిన అర్జీ మేరకు సదరు కాలనీ, నల్లపాడు చెరువు, ఏటుకూరు రోడ్ కంపోస్ట్ యార్డ్, బ్రాడీపేట మస్టర్ పాయింట్ తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత శ్రీనివాస కాలనీలో అర్జీ అందించిన స్థానిక ప్రజలతో కలిసి పర్యటించి, వారి ద్వారా సమస్యలు అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ శ్రీనివాస కాలనీలో డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకపోవడం వలన మురుగు పారుదల లేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకు తగిన విధంగా సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని ఈఈని ఆదేశించారు. కాలనీ మెయిన్ రోడ్ ని ఆర్&బి అధికారులతో సమన్వయం చేసుకొని, సర్వే చేసి, డ్రైన్, రోడ్ ఆక్రమణలను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. సచివాలయ కార్యదర్శులు తమ సచివాలయం పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారానికి సంయుక్తంగా కృషి చేయాలన్నారు. నల్లపాడు చెరువుని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకొని అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఏటుకురూ రోడ్ లోని జిఎంసి కంపోస్ట్ యార్డ్ ని పరిశీలించి, యార్డ్ కి ప్రతి రోజు చెత్తని తెస్తున్న వాహనాల ట్రిప్ ల వివరాలను నివేదికలో అందించాలన్నారు. తొలుత బ్రాడీపేట మస్టర్ పాయింట్ ని పరిశీలించి, కార్యదర్శులు మస్టర్ సమయానికి విధులకు రావాలని, పారిశుధ్య నిర్వహణ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పర్యటనలో ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, సిఎంఓహెచ్ డాక్టర్ అమృతం, డిసిపి సూరజ్ కుమార్, ఈఈ సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రవిబాబు, ఏసిపి వెంకటేస్వర్లు, ఆర్ఓ రెహ్మాన్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News