అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వచ్చే ఉగాది నుండి పి-4 (పబ్లిక్-ప్రవేట్-పీపుల్స్-పార్టనర్ షిప్ప్)విధానం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు.పి-4 విధానంపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులు,వర్చువల్ గా పాల్గొన్న జిల్లా కలక్టర్లతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పి-4 విధానాన్నిఅమలు చేయనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం మంది పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నదే పి-4 విధానం ముఖ్య ఆశయమని ఆయన పేర్కొన్నారు.పూర్తి స్థాయిలో విధి విధానాల రూపకల్పనకు ప్రజల నుండి సూచనలు,సలహాలు స్వీకరించండంతో పాటు దీనికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను కూడా రూపొం దిస్తున్నట్లు చెప్పారు.ఈ సలహాలు, సూచనలు ఆధారంగానే పి-4 విధానాన్ని అమలు చేస్తామని అన్నారు.పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలు,ఎన్నారైలు తదితరులను ఉగాది రోజు జరిగే పి-4 ప్రారంభ కార్యక్రమానికి ప్రభుత్వం ఆహ్వానించి వారందరినీ ఒకే గొడుగు కిందకు తీసుకు రావడం ద్వారా పి-4 అమలమకు శ్రీకారం చుట్టనున్నట్టు సిఎస్ చెప్పారు.
స్వర్ణఆంధ్ర విజన్-2047లో భాగంగా ప్రతి ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా ఆవాసం, గ్రామ, మండల, నియోజకవర్గం,జల్లా స్థాయి విజన్ ప్రణాళికలను రూపొందించాల్సి ఉందని సిఎస్ విజయానంద్ స్పష్టం చేశారు.ఇందుకుగాను ప్రతి నియోజకవర్గానికి జిల్లా స్థాయి అధికారిని నోడలు అధికారిగా నియమించాలని జిల్లా కలక్టర్లను ఆదేశించారు.నోడలు అధికారికి 6గురు సభ్యుల బృందం అనగా గ్రామ వార్డు సచివాలయాలకు చెందిన 5గురు, ప్రణాళికా శాఖ ద్వారా ఒక ప్రొపెషనల్ సహాయపడతారని అన్నారు.ప్రణాళికా శాఖ ద్వారా ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా వివరాలు సేకరించాల్సి ఉంటుందని ఈకన్సల్టెన్సీ సర్వేను ఫిబ్రవరి 7వ తేదీ నుండి 22వ తేదీ లోగా సేకరించాల్సి ఉందన్నారు.ఈసమయంలో పంచాయితీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ గ్రామ సభలు,పంచాయితీ సమావేశాలను,ప్రణాళిక శాఖ ద్వారా జిల్లా స్థాయిలో ఇన్ చార్జి మంత్రి నేతృత్వంలో వివిధ ప్రజాప్రతినిధులు,స్వచ్ఛంధ సంస్థలు, నిపుణులతో సమావేశాల నిర్వహణ,విద్యాశాఖ ద్వారా పాఠశాలలు,కళాశాలల స్థాయిలో విద్యార్ధులకు వ్యాస రచన,వ్యక్తృత్వ పోటీలు,మున్సిపల్ శాఖ ద్వారా జిల్లా కేంద్రాల్లో పేదరిక నిర్మూలన ఆవశ్యకతపై మారధాన్ వంటివి నిర్వహించాల్సి ఉందని చెప్పారు.
రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు(CBP)ఏర్పాటుకు వెంటనే స్థలాలు గుర్తించాలి
రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రిలయెన్స్ సంస్థ ముందుకు వచ్చిన నేపధ్యంలో వాటి ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తించేందుకు జిల్లా కలక్టర్లను వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.ప్రతి ప్లాంట్ కు 25 ఎకరాలు భూమి అవసరం ఉంటుందని భూములను గుర్తించి సిసిఎల్ఏకు అడ్వాన్సు పొజిషన్ కై ప్రతిపాదనలు పంపాలని అన్నారు.రైతు ఉత్పత్తిదారుల సంఘాలు,స్వయం సహాయక సంఘాలు,వన సంరక్షణ సమితులు వంటి వారిని దీనిలో పూర్తిగా భాగస్వామ్యం చేయడం ద్వారా వీటి ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఇ పార్కు ఏర్పాటుకు చర్యలు
రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఇ పార్కు ఏర్పాటు చేసేందుకు వీలుగా మార్చి 15లోగా సర్వే నిర్వహించాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు.ఎండిఓలు,మున్సిపల్ కమీషనర్లు ఈఎంఎస్ఎంఇ సర్వే సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని చెప్పారు.
అంతకు ముందు ఈసమావేశంలో రాష్ట్ర ప్రణాళిక,ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పి-4 విధానం అమలు,స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ ప్రణాళికలో భాగంగా ఆవాసం, గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా ప్రణాళికల రూపకల్పనకు తీసుకోవాల్సిన అంశాలపై వివరించారు. అలాగే పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్ ఎంఎస్ఎంఇ సర్వే నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఇంకా ఈసమావేశంలో ఐటి,ఆర్టిజిఎస్ శాఖల కార్యదర్శి కె.భాస్కర్,ఆర్టీజిఎస్ సిఇఒ దినేష్ కుమార్, వీరపాండ్యన్,కీర్తి,శివ ప్రసాద్,అనంత శంకర్ తదితర అధికారులు పాల్గొనగా వర్చువల్ గా పలువురు కార్యదర్శులు,జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News