గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులకు టెండర్ ద్వారా వర్క్ ఆర్డర్ పొందిన కాంట్రాక్టర్లు నిర్దేశిత గడువు మేరకు పనులను పూర్తి చేయాలని, గడవు ప్రకారం చేయని పనులను రద్దు చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కాంట్రాక్టర్లకు స్పష్టం చేశారు. శుక్రవారం కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులతోనగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత మాట్లాడుతూ కాంట్రాక్టర్ల వారీగా టెండర్ పొందిన పనులు, పెండింగ్ పనుల వివరాలను కాంట్రాక్టర్లను, అధికారులను అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ నగరాభివృద్ధికి కాంట్రాక్టర్లు సకాలంలో చేపట్టే పనులే కీలకమని, పనుల్లో జాప్యం జరిగితే ప్రజలకు అసౌకర్యంతో పాటు అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. కనుక టెండర్ ద్వారా వర్క్ ఆర్డర్ పొందిన ప్రతి కాంట్రాక్టర్ తప్పనిసరిగా నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. పనులు పూర్తయిన సీనియారిటీ మేరకు బిల్లుల చెల్లింపు చేస్తామని, ప్రతి నెల చెల్లించిన బిల్లుల వివరాలను కూడా అందిస్తామని తెలిపారు. జిఎంసి ఆర్ధిక వెసులుబాబు బట్టి జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా సాదారణ నిధులు, సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లుల చెల్లింపు జరుగుతున్నాయన్నారు. అలాగే కాంట్రాక్టర్లకు అత్యవసరపరిస్థితులు ఎదురైన వారు తమ దృష్టికి తెస్తే సీరియల్ కాకుండా బిల్లుల చెల్లింపు చేస్తామని పేర్కొన్నారు. పలు పనులకు వర్క్ ఆర్డర్ పొంది, పనుల నిర్వహణలో జాప్యం చేస్తే ఆయా పనులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. పనులు జరిగే ప్రాంతంలో సర్వే లేదా ఇతర సమస్యలు ఎదురైతే పట్టణ ప్రణాళిక అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఈఈలను ఆదేశించారు. కాంట్రాక్టర్లు తమకు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను తమ దృష్టికి ఎప్పుడైనా తీసుకురావచ్చని, అలా కాకుండా సమస్య పేరుతో పనుల్లో జాప్యం చేయవద్దని తెలిపారు. త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు, ప్యాచ్ వర్క్ లను కూడా ఎప్పటికప్పుడు వేగంగా చేయాలన్నారు.
సమావేశంలో ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, ఈఈలు సుందర్రామిరెడ్డి, కోటేశ్వరరావు, డిఈఈలు, ఏఈలు, కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొండా రమేష్, కుంచాల శివనాగేశ్వరరావు, జైరాం రెడ్డి, వెంకట్రావు, విష్ణువర్ధనరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రభాకర్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News