అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విభజన అనంతరం 2014-15 నుండి 2018-19 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తలసరి ఆదాయంలో సమానంగా పోటీ పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ 13.21% వృద్ధిని నమోదు చేయగా, తెలంగాణ 13.37% వృద్ధిని సాధించింది, కేవలం స్వల్ప తేడా మాత్రమే ఉండేది. జాతీయ సగటు 9.75%తో పోలిస్తే రెండు రాష్ట్రాలు మెరుగైన స్థానంలో ఉన్నాయి. అయితే, 2019-20 నుండి 2023-24 మధ్య రెండు రాష్ట్రాల మధ్య భారీ తేడా వచ్చింది. జాతీయ సగటు 8.16%కి తగ్గినా, తెలంగాణ కొంతవరకు నిలబడింది, కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం గణనీయంగా వెనుకబడింది. తెలంగాణ తలసరి ఆదాయం 13.21% నుండి 11.45%కి తగ్గి ₹3,56,564కి చేరింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ 13.21% నుండి 9.18%కి తగ్గి ₹2,37,951కి పడిపోయింది. ఈ రెండు రాష్ట్రాల తలసరి ఆదాయంలో ₹1,18,613 వ్యత్యాసం ఏర్పడింది. 2014-15లో 13.07%గా ఉన్న ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి వృద్ధి రేటు 2023-24కు 8.60%కి తగ్గింది. అయితే, 2024-25 మొదటి ముందస్తు అంచనా 12.90%గా ఉంది.
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం “వికసిత్ భారత్ @2047″కు అనుగుణంగా “స్వర్ణ ఆంధ్ర @2047” విజన్ ప్రణాళికను రూపొందించింది. దీనిలో భాగంగా రాష్ట్రం సంవత్సరానికి 15% కంటే ఎక్కువ వృద్ధితో $42,000 తలసరి ఆదాయంతో $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. సంవత్సరానికి వృద్ధి రేటు 7.5% నుండి 15%కి రెట్టింపు అయితే, జిఎస్డిపి మరియు తలసరి ఆదాయం 4.4 రెట్లు కంటే ఎక్కువ పెరుగుతాయని అంచనా వేశారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయకుండా ప్రజలపై భారం వేస్తే వృద్ధి రేటు కుంటుబడుతుందని, ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేయడానికి మానసికంగా సిద్ధపడాలని, దాని ద్వారా ప్రజలకు సంపదను పంచవచ్చు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించారు.
దీనికోసం రాష్ట్ర, జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ఐదేళ్ల ప్రణాళికలు రూపొందించబడతాయి. జిల్లా అధికారులకు శిక్షణ మరియు మార్గదర్శకత్వం అందిస్తారు. వేగవంతమైన మరియు సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించే ప్రాజెక్టులను జిల్లా స్థాయిలో గుర్తిస్తారు.మండల, జిల్లా, నియోజకవర్గ మరియు రాష్ట్ర స్థాయిలో లక్ష్యాల పర్యవేక్షణకు ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేస్తారు. విజన్ అమలును వేగవంతం చేయడానికి సిబ్బందిని డిప్యూటేషన్ పద్ధతిలో నియమించాలని ప్రతిపాదించారు.
స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ వార్షిక వృద్ధి 15%+గా లక్ష్యంలో భాగంగా.. 2025-26కి జిఎస్డిపి వృద్ధి లక్ష్యం 16%+గా నిర్ణయించబడింది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో ఉత్పాదకత, వ్యవసాయ వాణిజ్యీకరణ, పారిశ్రామిక విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సేవా రంగంలో ఉత్పాదకత, నాలెడ్జ్ ఎకానమీ,టెక్నాలజీ,కృత్రిమ మేధ వినియోగం,పరిపాలన మరియు ఆర్థిక సంస్కరణలలో నిరంతర ప్రయత్నాలు, పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు జిఎస్డిపి అభివృద్ధికి దోహదపడతాయి. వ్యవసాయం & అనుబంధ రంగాల్లో 2024-25లో ₹5,19,485 కోట్లు (15.86% వృద్ధి రేటు); 2025-26 లక్ష్యం: ₹6,02,728 కోట్లు (16.02% వృద్ధి రేటు). పరిశ్రమల రంగంలో 3,41,331 (6.71%) నుండి 3,99,358 (17%) లక్ష్యంగా పెట్టుకొనగా. సేవల రంగంలో 6,11,390 (11.70%) నుండి 7,10,714 (16.25%) లక్ష్యంగా పెట్టుకొన్నారు.
Prajavartha Online Telugu News