అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాభివృద్ధికి ఐగోట్ కర్మయోగి పోర్టల్ స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా నైపుణ్యాభివృద్ధికి, మానవ వనరుల అభివృద్ధికి ఇది ఒక వ్యూహాత్మక సాధనంగా ఉపయోగపడుతుంది. ఇటీవల, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ (CBC) మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఐగోట్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ సొసైటీ మరియు కెపాసిటీ బిల్డింగ్ పాలసీ – 2025ను మంత్రివర్గం ఆమోదించింది.
రాష్ట్రంలోని వివిధ శాఖల నుండి సుమారు 8.2 లక్షల మంది ఉద్యోగులు ఇప్పటికే ఐగోట్ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఐగోట్ కర్మయోగి అనేది ప్రభుత్వ ఉద్యోగుల నిరంతర సామర్థ్యాభివృద్ధి కోసం ఉపయోగించబడే డిజిటల్ లెర్నింగ్ వేదిక.
నైపుణ్యం-ఆధారిత శిక్షణ ద్వారా పరిపాలనను మెరుగుపరచడమే దీని ముఖ్య లక్ష్యం.ఈ వేదిక ద్వారా ఉద్యోగులు ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా తమకు కావలసిన శిక్షణను పొందవచ్చు.దీనివల్ల నైపుణ్యాల పెంపు నిర్ధారించబడుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కొత్త విధానాలు, పరిపాలన నమూనాలు మరియు అవసరమైన నైపుణ్యాలతో ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి ఈ వేదిక సహాయ పడుతుంది. మెరుగైన సేవలందించడానికి ఇది నైపుణ్యం-ఆధారిత శిక్షణను అందిస్తుంది. నిర్మాణాత్మక అభ్యాసం ద్వారా ఉద్యోగుల వృత్తిపరమైన అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది. అధునాతన సామర్థ్యపు అభివృద్ధి కోసం జాతీయ శిక్షణా సంస్థలతో అనుసంధానం చేయబడింది.
ఐగోట్ కర్మయోగి అనేక కీలక లక్షణాలను కలిగి ఉంది. ఇది ఆన్‌లైన్, ఫ్లెక్సిబుల్ మరియు స్వీయ-వేగ అభ్యాసానికి అవకాశం కల్పిస్తుంది. పనితీరు మెరుగుదల మరియు ఏఐతో నడిచే ప్రొఫైల్ ఆధారిత సిఫార్సులకు అనుసంధానించబడిన నైపుణ్యం-ఆధారిత అభ్యాస విధానాన్ని అనుసరిస్తుంది. అంతేకాకుండా, తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో కోర్సులు అందుబాటులో ఉండటం వలన స్థానిక కంటెంట్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వబడింది. కోర్సులను విజయవంతంగా పూర్తి చేసిన ఉద్యోగులకు ధృవీకరణ పత్రాలు మరియు గుర్తింపు కూడా అందించబడతాయి.కెపాసిటీ బిల్డింగ్ మరియు నైపుణ్యాల అభివృద్ధిని మెరుగుపరచడం లక్ష్యంగా గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (GIGG) ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.GIGG కార్యక్రమాల సమర్థవంతమైన అమలు కోసం ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీలో మంత్రులు హ నారా లోకేష్,పయ్యావుల కేశవ్ మరియు పొంగూరు నారాయణ సభ్యులుగా ఉన్నారు.
భవిష్యత్తులో, తెలుగు భాషలో డిజిటల్ కోర్సులను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించారు. అలాగే, గ్లోబల్ నాలెడ్జ్ ఇన్‌స్టిట్యూషన్‌లతో సహకారాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఏఐ-ఆధారిత ప్రొఫిలె బేస్డ్ లెర్నింగ్ అనుభవాలను మెరుగుపరచడంపై దృష్టి సారించారు.ఆంధ్రప్రదేశ్‌ను నైపుణ్యం-ఆధారిత పరిపాలనకు జాతీయ నమూనాగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాకుండా విద్యార్థులు, MSMEలు మరియు పారిశ్రామికవేత్తలు కూడా డిజిటల్ నైపుణ్యాలను విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.”కర్మయోగి ఉద్యమంలో చేరి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మంచి పరిపాలన మరియు ఆవిష్కరణ కేంద్రంగా మార్చే కార్యక్రమంలో భాగస్వామలు అవ్వండి అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళుతున్నామని సియం అన్నారు.
Prajavartha Online Telugu News