-పళనిలో మీడియాతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-పళని శ్రీ అర్ములిగ దండాయుధ మురుగన్ స్వామి వారి సన్నిధిలో పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జ్ఞానం సర్వసిరుల మూలం. విశ్వాన్ని చుట్టి వచ్చే విషయంలో తన సోదరుడు శ్రీ విఘ్నేశ్వరుడి చేతిలో ఓడి జ్ఞాన సంపన్నత కోసం ఆది దంపతుల ముద్దుల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్యుడు భూమికి వచ్చారు. జ్ఞాన సముపార్జన కోసం వచ్చిన స్వామి పళని కొండపై వెలిశారు అని చెబుతారు. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమే పళని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం. దండాయుధపాణిగా, పళని స్వామిగా, మురుగన్ గా పిలుచుకునే శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి సేవలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం పాల్గొన్నారు. దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా షష్ట షణ్ముఖ క్షేత్రాల పర్యటనలో శుక్రవారం పళనిలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి దర్శనానికి విచ్చేశారు. అర్ములిగు దండాయుధపాణి స్వామి వారి క్షేత్రంలో, ఉచ్ఛ కాల పూజలో పాల్గొన్నారు. రోప్ వే ద్వారా ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి క్షేత్రాన్ని దర్శించారు.
ఆధ్యాత్మిక ఆనందంలో పవన్ కళ్యాణ్
పళనిలోని మురుగన్ విగ్రహాన్ని ఆశీవాహం (ప్రాచీన తమిళ సంస్కృతి) యొక్క పద్దెనిమిది గొప్ప సిద్ధులలో ఒకరైన భోగర్ మహర్షి తొమ్మిది విషాల లేదా నవపాషాణం మిశ్రమంతో సృష్టించి, ప్రతిష్టించారు. ఆలయ నైరుతి ముఖంలో భోగర్ మహర్షి వారికీ ప్రత్యేక మందిరం ఉంది. పురాణాల ప్రకారం కొండ మధ్యలోని గుహలో భోగర్ మహర్షి వారు ధ్యానం చేస్తూ తన జాగరణను కొనసాగిస్తున్నారని, అక్కడ ఎనిమిది మురుగన్ విగ్రహాలు ఉన్నట్లు చెబుతారు.
పళనిలో అత్యంత ముఖ్యమైన పండుగగా పరిగణించే థాయ్-పూసం, తమిళ థాయ్ నెల (జనవరి 15-ఫిబ్రవరి 15) పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కీలకమైన పండుగ పౌర్ణమి రోజుల్లోనే పవన్ కళ్యాణ్ శ్రీ మురుగన్ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు.. పూజల అనంతరం పవన్ కళ్యాణ్ కి ఆలయ పండితులు దైవిక మిశ్రమంగా పిలిచే తేనె, ఖర్జూరం, అరటిపండు, ఎండుద్రాక్ష, బెల్లం కలిపిన పంచమిర్దం అందించారు. దానిని మహా ప్రసాదంగా ఉప ముఖ్యమంత్రి స్వీకరించారు. అనంతరం ఆలయ ఆవరణలోనే ఉన్న శివాలయంలో పూజలు చేశారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం ఆలయం వెలుపల పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. “శ్రీ పళని సుబ్రమణ్య స్వామి క్షేత్రం నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు సులభంగా వచ్చేలా రవాణా సౌకర్యాలు కల్పించడం పై దృష్టి పెడతాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియచేస్తాను. అలాగే క్యాబినెట్ దృష్టికి తీసుకు వెళ్తాను. ఇటీవల మహారాష్ట్రలో పర్యటించినప్పుడు కూడా అక్కడి నుంచి తిరుపతి రావడానికి ప్రత్యేక రైలు వేయాలని అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరారు. దీనిపై ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లాను. అలాగే పళని నుంచి కూడా తిరుమలకు కూడా తగిన రవాణా సౌకర్యం కల్పించడం పైన దృష్టి పెడతాం. తమిళనాడులో ఉన్న ఆరు ప్రసిద్ధి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించాలని తలంపుతో ఇక్కడికి వచ్చాను. ఇతర రాజకీయాల అంశాల మీద స్పందించేందుకు ఇది సమయం కాదు” అన్నారు.
Prajavartha Online Telugu News