గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ త్రాగునీటి రిజర్వాయర్లను నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలని, ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం కమీషనర్ గారు తమ రోజు వారీ పర్యటనలో భాగంగా రెడ్డిపాలెం రిజర్వాయర్, వెహికిల్ షెడ్, సంజీవయ్య నగర్ రోడ్ విస్తరణ పనులు, నవభారత్ నగర్, జెకెసి నగర్ ల్లోని పలు ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, త్రాగునీటి సరఫరా వ్యవస్థ అత్యంత కీలకమని, త్రాగునీటి శుద్ధి జరిగే హెడ్ వాటర్ వర్క్స్ లో ప్రత్యేకంగా ల్యాబ్ లో క్లోరిన్, నాణ్యత పరిశీలించిన అనంతరమే రిజర్వాయర్లకు సరఫరా జరుగుతుందన్నారు. స్థానికంగా ఉండే రిజర్వాయర్లను నిర్దేశిత గడువు మేరకు తప్పనిసరిగా శుభ్రం చేయించాలని, శుభ్రం చేసిన తేదీ, వివరాలను రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసిన బోర్డ్ పై కనిపించేలా వ్రాయాలన్నారు. అలాగే ప్రతి ఏఈ పరిధిలో రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని పైప్ లైన్ లీకుల మరమత్తులను వెంటనే పూర్తి చేయాలని, ఎక్కడా త్రాగునీటి సరఫరా అందలేదనే ఫిర్యాదు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెహికల్ షెడ్ ని పరిశీలించి, ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో పారిశుధ్య పనులకు పంపే వాహనాలు తప్పనిసరిగా నిర్దేశిత సమయానికి వెళ్లాలన్నారు. ఈ-ఆటోలు, పుష్ కాట్స్, ఇతర వాహనాలు ఎప్పటికప్పుడు మరమత్తులు చేయించాలని ఏఈని ఆదేశించారు. సంజీవయ్య నగర్ గేటు నుండి రెడ్డిపాలెం రోడ్ వరకు చేపట్టిన విస్తరణ పనులను పరిశీలించి, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. త్వరలో శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు ప్రారంభమైతే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున పనులు వేగంగా జరగాన్నారు. జెకెసి నగర్, నవభారత్ నగర్ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించి, పనులు జరిగే సమయంలోనే నాణ్యత ప్రమాణాలు పాటించేలా ఎమినిటి కార్యదర్శులు, ఏఈలు పర్యవేక్షణ చేయాలన్నారు. పనుల్లో నాణ్యత లేకుంటే బిల్లుల చెల్లింపు నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
పర్యటనలో డిఈఈలు రమేష్ బాబు, కళ్యాణరావు, సతీష్ కుమార్, ఏసిపి రెహ్మాన్, ఆర్ఓ రవికిరణ్ రెడ్డి, ఎస్ఎస్ ఆయుబ్ ఖాన్, ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారయణరెడ్డి, ఏఈలు, టిపిఎస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News