మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతున్న వివిధ రకాల పథకాల రాయితీలను మత్స్యకారులకు అందించి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం ఆయన మత్స్య శాఖ అధికారులతో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యకారుల అభ్యున్నతికి అమలవుతున్న పలు పథకాల పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఎన్నో పథకాలు అమలు అవుతున్నాయని, వాటిపై వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
బోట్లు, వలలు, మోటార్ ఇంజన్లు, బోట్లలో బయో టాయిలెట్ల ఏర్పాటు, మత్స్య కియోస్క్ మెషిన్ల ఏర్పాటు, ఐస్ బాక్సులు, ఐస్ ప్లాంట్లు, లోతైన సముద్రంలో చేపల వేట యంత్రాలు తదితర యూనిట్ల మంజూరుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొంత మంది లబ్ధిదారులకు పలు రకాల యూనిట్లకు సంబంధించి సబ్సిడీ రాయితీలు ఇంకా రావాల్సి ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత అంశాలపై పైఅధికారులకు తెలియజేసేందుకు లేఖలు సమర్పించాలన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆయా యూనిట్ల మంజూరుకు పూర్తి స్థాయిలో ఆర్థిక చేయుతనిచ్చేలా సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులకు లేఖల ద్వారా తెలియజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో మత్స్య శాఖ జిల్లా అధికారి నాగబాబు, పలువురు సహాయ సంచాలకులు, మత్స్య అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News