-వామపక్ష వాదులు, కష్టజీవుల ఆకాంక్ష
-వందేళ్ల ప్రస్తానంలో అనేక పోరాటాలు.
-భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమం
-దేశ వ్యాప్తంగా అనేక పోరాటాలు
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
-మార్క్సిస్టు ఆలోచనా పరుల వేదిక సదస్సు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణకు సమైక్యంగా కృషి చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పునరుద్ఘాటించారు.
దేశ రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని కాపాడటానికి, కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవడానికి మనమందరమూ సమైక్యం కావాలని కోరారు. విజయవాడ సివిల్ కోర్టుల సమీపంలోని బుక్ ఫెస్టివల్ సొసైటీ లైబ్రరీ హాలులో మార్క్సిస్టు ఆలోచనా పరులవేదిక ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు ఉద్యమ శత వార్షిక సదస్సును ఆదివారం నిర్వహించారు. కమ్యూనిస్టు ఉద్యమ పురోగమనం, ఆవశ్యకత, అవకాశాలు, అవరోధాల అంశంపై సదస్సులో వక్తలు ప్రసంగించారు. దీనికి సీపీఐ, సీపీఎంతోపాటు వామపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు. సమావేశానికి వేదిక కన్వీనర్ చిగురుపాటి భాస్కరరావుతోపాటు విశ్రాంత ఆచార్యులు నూర్ బాషా, న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్, జి.శ్రీనివాసరావు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.
రామకృష్ణ మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ జరగాలని సీపీఐ ఆకాంక్షిస్తోందన్నారు. అందుకుగాను ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో పునరేకీకరణపై చర్చించామని గుర్తుచేశారు. సీపీఐ శత వార్షికోత్సవాల సందర్భంగా పునరేకీకరణ వైపు పార్టీ ముందడుగు వేయాలని భావించిందన్నారు.
గతేడాది డిసెంబరు 26న కాన్పూరులో సీపీఐ శత వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయని, అవి ఈ ఏడాది అంతా కొనసాగుతాయని చెప్పారు. ఈఏడాది డిసెంబరు 24, 25 తేదీల్లో శత వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా విజయవాడలో జాతీయ స్థాయి సదస్సులు నిర్వహిస్తామన్నారు. అనంతరం డిసెంబరు 26న ఖమ్మంలో ముగింపు సభ సందర్భంగా లక్షలాది మంది ప్రజలతో భారీ ప్రదర్శన జరుగుతుందని చెప్పారు. దీనికి 40 దేశాల నుంచి ప్రతినిధులను, సోషలిస్టు వాదులను, దేశ వ్యాప్తంగా వామపక్ష మేధావులను ఆహ్వానిస్తున్నామని వివరించారు. ఈ వందేళ్ల కమ్యూనిస్టు ప్రస్తానంలో దేశ వ్యాప్తంగా అనేక పోరాటాలు చేసిందని, స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రధాన భూమిక పోషించిందని గుర్తుచేశారు. ఎనలేని త్యాగాలు చేసిందని, భూమి కోసం, భుక్తి కోసం చేసిన పోరాటాల్లో దున్నే వాడికే భూమి అనే నినాదంతో ఉద్యమించిందన్నారు. స్వాతంత్య్రం అనంతరమూ భూ సంస్కరణ చట్టం కోసం, స్థానిక స్వపరిపాలన కోసం, సహకార రంగాభివృద్ధికి, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం అనేక పోరాటాలు చేసిందని వివరించారు. 1925లో ఆవిర్భావించిన ఆరెస్సెస్, దానికి సంబంధించిన బీజేపీ నేడు అధికారంలో కొనసాగుతున్నాయన్నారు. ఈ రెండిరటికీ స్వాతంత్య్ర పోరాటంతోగాని, ప్రజా ఉద్యమాలతోగాని సంబంధం లేదని నొక్కిచెప్పారు. పోరాటాలు చేసిందీ కమ్యూనిస్టులేనని, దురదుష్టవశాత్తు చీలికతో నష్టబోయామని, దీనికి అనేక అంతర్జాతీయ పరిణామాలు, కారణాలు కావచ్చు అని తెలిపారు. కమ్యూనిస్టులు విడిపోవడంతో దేశ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోతున్నామన్నారు. వామపక్ష అభిమానులు, మార్క్సిస్టు మేథావులు, కష్టజీవులంతా కమ్యూనిస్టులు ఏకం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. నేదు దేశంలో కమ్యూనిస్టులు అందరూ కలిసి పనిచేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని సూచించారు. దేశంలో ఒక మతత్వ పార్టీ, అభివృద్ధి నిరోధక పార్టీ గద్దెనెక్కి..కార్పొరేట్ వర్గ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. మతాన్ని రెచ్చగొట్టి..మతం అజెండాతో మైనార్టీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి తమ రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకుంటోందన్నారు. దీనికితోడు వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా సీపీఐ శత వార్షికోత్సవాల్ని జరుపుతున్న సమయంలో వామపక్ష పార్టీలతో కలిపి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసిన నిర్వాహకుల్ని ఆయన అభినందించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్వి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేశంలో కార్మిక రైతాంగ పోరాటాలతో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద విశాఖ ఉక్కు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి అనేక సమస్యలపై వామపక్ష పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఆ పోరాట క్రమంలో కమ్యూనిస్టులు ఒక్కటి అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
చిగురుపాటి భాస్కరరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న చీలికలు ఆసరాగా చేసుకుని ఫాసిస్టు మతోన్మాద కార్పొరేట్ శక్తులు, దోపిడీదారులు దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం పెరిగిందని, దళితులు, మైనార్టీల హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాయని, ప్రభుత్వరంగ సంస్థల్ని కార్పొరేట్ పరం చేస్తున్నారన్నారు.
వివిధ సీపీఐ(ఎంఎల్) పార్టీ నాయకులు కేజీ రామచందర్, నరసింహస్వామి, పి.ప్రసాద్, ఎంపీ రామ్‌దేవ్, మన్నవ హరిప్రసాద్, పాడిబండ్ల కోటేశ్వరరావు, విరసం కార్యదర్శి పినాకపాణి, ఎంసీపీఐ(యూ) నాయకులు కె.నాగభూషణం, వెంకటరెడ్డి, అమర్‌నాథ్ తదితరులు మాట్లాడుతూ, ఆయా పార్టీల విధానాల్ని వెల్లడిరచారు. మార్క్స్, లెనిన్, మావో, అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముందుకు సాగాలని సూచించారు. సామాజిక వేత్తలు బండ్ల శ్రీనివాస్, మోతుకూరి అరుణకుమార్, డ్యాని, సైకం రాజశేఖర్, రంగారెడ్డి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News