-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలను నిరుత్సాహపరిచిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. పేదలకు ఈ బడ్జెట్ తో ఒరిగిందేమీ లేదని.. ఎన్నో విషయాలపై అస్పష్టత ఉందన్నారు. గత బడ్జెట్‌లో కూడా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు. వైఎస్ జగన్ కంటే డబుల్ ఇస్తామని ఎన్నికల్లో నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి బడ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించలేదన్నారు. రూ. 3 వేల నిరుద్యోగ భృతి, ఉచిత బస్సుల ఊసే లేదని దుయ్యబట్టారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు నిధుల కేటాయింపుల్లో భారీగా కోత విధించారన్నారు. లక్ష కోట్ల అప్పులు తెచ్చిన మీరు.. అవేం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇప్పటికే అమ్మ ఒడి డబ్బులు అందేవని, రైతు భరోసా సాయం చేసేవారన్నారు. ధరల స్థిరీకరణ కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ. 3 వేల కోట్లు కేటాయించగా.. కూటమి ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఇవి ఏమాత్రం సరిపోవన్నారు. ఈ బడ్జెట్ మొత్తం అంకెల గారడీగానే కనిపిస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికి.. చంద్రబాబు, లోకేష్ లను పొగుడుకోవటం కోసం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఉందని దుయ్యబట్టారు. మొత్తానికి ఈ బడ్జెట్ ప్రజలను మాటలతో గారడీ చేసే మోసపూరిత బడ్జెట్ అని మల్లాది విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News