గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ నిబందనల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నివాసం ఉండే ప్రతి ఒక్కరూ స్థానిక వార్డ్ సచివాలయం హౌస్ హోల్డ్ డేటాలో తప్పనిసరిగా నమోదై ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మిస్సింగ్ సిటిజన్ సర్వే చేపట్టిందని, అందులో భాగంగా నగరంలో నివసించే ప్రతి ఒక్కరినీ స్థానిక వార్డ్ సచివాలయం పరిధిలో హౌస్ హోల్డ్ డేటాలో నమోదు చేయడం జరుగుతుందన్నారు. డేటాలో ప్రభుత్వ ఉద్యోగులతో సహా నగరంలోని ప్రతి ఒక్కరూ నమోదు కావాల్సి ఉంటుందన్నారు. భవిష్యత్ లో భూ పట్టాలు, అడంగల్, పట్టాదారు పాసు పుస్తకాలు, పాస్ పోర్ట్, ఆధార్ సేవలు, పుర సేవలు అందడానికి హౌస్ హోల్డ్ డేటాలో నమోదు తప్పనిసరి అని అన్నారు. ప్రభుత్వ సేవలు, సమాచారం, సంక్షేమ పధకాలు అందించడానికి కూడా డేటా ప్రధానమైనదని తెలిపారు. అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటి, గ్రూప్ హౌస్ ల్లో ఉండేవారిలో ఎక్కువ మంది మిస్సింగ్ సిటిజన్ కేటగిరిలో ఉన్నారని, అటువంటి వారు తమ వద్దకు వచ్చే సచివాలయ కార్యదర్శులకు తగిన సమాచారం అందించి సహకరించడం ద్వారా హౌస్ హోల్డ్ డేటాలో నమోదు కావాలని, సదరు నమోదుపై ఏ విధమైన అపోహలు పెట్టుకోవద్దని కోరారు.
Prajavartha Online Telugu News