-రూ.5.72కోట్లతో లెగసీ వేస్టు మేనేజ్మెంటు ప్లాంట్ కు శ్రీకారం
-రాష్ట్రం, కేంద్రం, నగరపాలక సంస్థ సహకారంతో ఏర్పాటు
-ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రిలోని ఆర్ అండ్ బి కంపోస్టు యార్డు సమీపంలోని ప్రజలు దశాబ్ద కాలంగా ఎదుర్కొంటున్న దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. రూ.5.72 కోట్లతో పేపర్ మిల్లు ఎదురు రోడ్డులోని డంపింగ్ యార్డులో ఏర్పాటు చేసిన లెగసీ వ్యర్ధాల నిర్వహణ (వేస్టు మేనేజ్మెంటు) ప్లాంట్ ను శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ…బయో ట్రీట్మెంట్ అయ్యాక చిన్న వ్యర్థం కూడా ఉండదని అన్నారు. రాష్ట్రం, కేంద్రం, నగరపాలక సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ప్లాంట్ ఏర్పాటు ఆరునెలల్లో పూర్తవుతుందని, అక్టోబరు 2 నాటికి స్థానిక 42, 45, 46 వార్డుల ప్రజలు దుర్వాసన నుంచి ఉపశమనం పొందుతారని అన్నారు. కాకినాడ మాదిరి రాజమండ్రిలో కూడా జిందాల్ తో ఒప్పందం చేసుకుంటామని, ఇప్పటికేప్రభుత్వంతో ఎంవోయూ అయిందని, మంత్రి నారాయణ ఆరు ఎకరాల్లో దీని కోసం చర్యలు చేపడుతున్నారని ఆయన చెప్పారు. కమిషనర్ దృష్టి సారించారని, ఇది అమలు జరిగితే సాయంత్రం ఇళ్ళలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించి ట్రీట్మెంట్ చేస్తారని ఆయన తెలిపారు. క్వారీ ప్రాంతంలోని చౌడేశ్వరి నగర్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్.అండ్ బి సమీపంలో ఉన్న కమ్యూనిటీ హాలును గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పుడు రూ. 50 లక్షలతో తిరిగి బాగు చేయిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలోని 5 వేల మంది ప్రజలకు ఉపయోగపడే విధంగా రైతు బజారు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News