-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
-అఖండ గోదావరి ప్రాజెక్టుతో గోదావరి పరిసర ప్రాంతాల్లో కొత్త సొబగులు:మంత్రి కందుల దుర్గేష్
-సరికొత్తగా దర్శనమివ్వనున్న హేవలాక్ వంతెన, కడియం నర్సరీలు, నిడదవోలు కోట సత్తెమ్మ ఆలయం
-చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా ఏర్పాట్లు, సందర్శకులకు మెరుగైన వసతుల కల్పన
-రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్
అమరావతి/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంజూరైన ప్రతిష్టాత్మక అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు జూన్ 19న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరిలు శంకుస్థాపన చేయనున్నారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సాస్కి -2024-25 (స్పెషల్ అసిస్టెన్స్ టూ స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్) స్కీమ్ ద్వారా మంజూరైన రూ.97 కోట్లతో రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, కడియం, కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి పనులు జరగనున్నాయని మంత్రి చెప్పారు. పవిత్ర గోదావరి పుష్కరాలలోపే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. తద్వారా గోదావరి పరిసర ప్రాంతాలు సరికొత్త సొబగులు సంతరించుకోనున్నాయని, చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలిపేలా సందర్శకులకు మెరుగైన వసతుల కల్పనతో పాటు మంచి అనుభూతిని అందిస్తామని మంత్రి దుర్గేష్ వివరించారు.
127 ఏళ్ల చరిత్ర గలిగి వారసత్వ సంపదకు ప్రతీకగా నిలిచిన చారిత్రాత్మక హేవలాక్ బ్రిడ్జిని ఆధునికీకరిస్తామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. హేవలాక్ వంతెన ప్రాంతంలో జలపాతాలు, గ్లాస్ వంతెనలు, గేమింగ్ జోన్, స్పేస్ థీమ్, అర్బన్ హాట్ క్రాఫ్ట్ బజార్, హ్యాంగింగ్ గార్డెన్స్, హాలోగ్రామ్ జూ, టైమ్ ట్రావెల్, రైల్ మ్యూజియం, ఆక్వేరియం టన్నెల్ లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నామని వివరించారు.
హేవలాక్ వంతెన పక్కనే ఉన్న పుష్కర్ ఘాట్ ను మరింతగా అభివృద్ధి చేసి అధ్యాత్మిక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు. హేవలాక్ వంతెన, పుష్కర్ ఘాట్ రెండింటిని అనుసంధానించి డైనమిక్ టూరిస్ట్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్నారు. పుష్కరాల రేవులో ఏడాది పొడవునా పవిత్ర స్నానాలు ఆచరించేలా, అధ్యాత్మికత స్పురించేలా, మరింత అధ్యాత్మికత ఉట్టిపడేలా చుట్టూ ఉన్న ఆలయాలను ఆర్కిటెక్చరల్, డిజైన్ లతో సౌందర్యవంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు.
భారతదేశపు అతి పెద్ద నర్సరీలో ఒకటైన కడియం నర్సరీకి పర్యాటక శోభ తెచ్చి సమీపంలోని గోదావరి కాలువ తదితర చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలకు పూర్వ వైభవం తేవాలని భావిస్తున్నామని మంత్రి దుర్గేష్ వివరించారు. గోదావరి చుట్టు ప్రక్కల పర్యాటకులు ఆహ్లాదంగా సేదతీరేలా, ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించేలా, కాలువలో పడవపై షికారు చేసే విధంగా తీర్చిదిద్దనున్నామన్నారు.
అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా విశిష్టమైన చారిత్రక నేపథ్యం కలిగి, అద్భుతమైన ప్రాకారాలు, ఆకట్టుకునే ముఖ ద్వారం, ఎత్తైన రాజగోపురంతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో అలరారుతున్న ప్రముఖ మహిమాన్విత ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కోట సత్తమ్మ దేవాలయాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దనున్నామన్నారు. అదనపు యాత్రికుల వసతి గృహాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఆలయ రాజగోపురం ఆధునికీకరించనున్నామని వివరించారు.
Prajavartha Online Telugu News