-వినతుల స్వీకరణ కోసం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక సెల్
-కలెక్టర్ ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వాస్తవ రైతుల నుంచే కోకో గింజల సేకరణ కోసం తహసిల్దార్, ఉద్యానవన అధికారులతో కూడిన ఒక ప్రత్యెక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అదే విధంగా కోకో రైతుల నుంచి వినతులు స్వీకరించడం కోసం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, తూర్పు గోదావరి జిల్లాలో కోకో పండించే రైతుల వద్ద ఉన్న ప్రతి గింజ కొనుగోలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కోకో రైతులకు లావాదేవీలు నిర్వహించే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, సమస్య ఉన్నా వాటిని పరిష్కరించే దిశలో కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ప్రత్యేక సెల్ సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పని దినాలలో ఉదయం 10.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు వినతులు స్వీకరించడం జరుగుతుందని వెల్లడించారు. ఫిర్యాదుల స్వీకరణ నమోదు కోసం ఆఫీసు పని వేళల్లో అందుబాటులో కంట్రోల్ రూమ్ 7995367797 ఫోన్ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత ఆధ్వర్యంలో పర్యవేక్షణా చేయనున్నట్లు తెలిపారు. వాస్తవ సాగు దారుల నుంచి కోకో దిగుబడులను ఈ నెలాఖరు లోపు పూర్తిగా సేకరించనున్నట్లు తెలిపారు. కిలో రూ.500 చొప్పున రైతుకు ధర చెల్లిస్తే, ప్రభుత్వం రూ.50 చొప్పున కంపెనీలకు రీయింబర్స్మెంట్ చేస్తుందని పేర్కొన్నారు. మిగిలిన సరుకును ఈ 30వ తేదీలోగా సేకరించాలని అధికారులకి లక్ష్యం నిర్ధేశించినట్లు కలెక్టర్ తెలిపారు.
Prajavartha Online Telugu News