– స్వర్ణాంధ్ర సాకారానికి సమష్టిగా కృషిచేద్దాం
– పీఏఐ 2.0తో పంచాయతీల అభివృద్ధిపై నిరంతర పర్యవేక్షణ
– కొత్త సూచీలో తొమ్మిది ఇతివృత్తాలు, 147 సూచికలు
– పంచాయతీల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రోత్సహించేందుకూ మార్గం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. గ్రామాల సుస్థిర అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధ్యమని బలంగా నమ్మిన మహాత్ముని ఆశయాల సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమంతో పాటు ఎన్నో అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలు అమలుచేస్తున్నాయని, వీటి ఆసరాతో వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనకు సమష్టిగా కృషిచేయాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
పంచాయతీ అభివృద్ధి సూచిక (పీఏఐ- Panchayat Advancement Index) 2.0పై శుక్రవారం ఎంజీ రోడ్డులోని పంచాయతీరాజ్ శాఖ సమావేశ మందిరంలో కార్యశాల జరిగింది. జెడ్‌పీటీసీలు, ఎంపీడీవోలు తదితరులు హాజరైన ఈ వర్క్‌షాప్‌నకు కలెక్టర్ లక్ష్మీశ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాత్మాగాంధీ, డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలతో పాటు ఆధునిక తెలుగు భాష వైతాళికుల్లో ఒకరైన గిడుగు వేంకట రామమూర్తి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనలో భాగంగా గ్రామ పంచాయతీల సంస్థాగత సామర్థ్యాలను పెంచేందుకు, ప్రగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పీఏఐ 1.0ను రూపొందించిందని.. ఇప్పుడు దీన్ని ఆధునికీకరించి పీఐఏ 2.0గా మార్చడం జరిగిందన్నారు. ఈ సూచీ కింద పేదరికం లేని, మెరుగైన జీవనోపాధులు కలిగిన పంచాయతీ; ఆరోగ్యకరమైన గ్రామ పంచాయతీ, బాలిక స్నేహపూర్వక గ్రామ సంచాయతీ, నీరు సమృద్ధిగల గ్రామ పంచాయతీ, పచ్చదనం, పరిశుభ్రత కలిగిన గ్రామ పంచాయతీ, స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాలు కలిగిన గ్రామ పంచాయతీ, సామాజిక న్యాయం-సామాజిక భద్రత కలిగిన గ్రామ పంచాయతీ, సుపరిపాలన కలిగిన గ్రామ పంచాయతీ, మహిళా స్నేహపూర్వక గ్రామ పంచాయతీ అనే తొమ్మిది ఇతివృత్తాల్లో 147 సూచికలు ఉన్నట్లు వివరించారు. గ్రామ పంచాయతీల్లో ప్రగతిని అంచనా వేసేందుకు, డేటా ఆధారిత పాలనను ప్రోత్సహించేందుకు, కొత్త విధానాలు, ప్రణాళికలు రూపొందించేందుకు ఈ సూచీ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమష్టి భాగస్వామ్యంతో సూచికల్లో ప్రగతి సాధనకు కృషిచేయడం ద్వారా లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. చేసిన కృషికి జాతీయ స్థాయి పురస్కారాల ద్వారా ప్రత్యేక గుర్తింపు కూడా లభిస్తుందని.. ఇందుకు ముప్పాళ్ల గ్రామమే ఉదాహరణ అని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ – పది సోపానాలు, కీలక ప్రగతి సూచికలు (కేపీఐ)లను పీఏఐ 2.0తో అనుసంధానిస్తూ పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
వర్క్‌షాప్‌లో జెడ్‌పీ సీఈవో కె.కన్నమ నాయుడు, డీపీవో పి.లావణ్యకుమారి, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, విజయవాడ డీఎల్‌డీవో ఎస్.నిర్మల జ్యోతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News