-జీజీహెచ్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నాం
-ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
-తాగునీరు, ఆహార నమూనాలను పరీక్షలకు పంపించాం
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన డయేరియా బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని.. జీజీహెచ్ లో మెరుగైన చికిత్స అందిస్తున్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ విజయవాడలోని న్యూ జీజీహెచ్ ను బుధవారం రాత్రి సందర్శించారు. బాధితులకు అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. 22 మందిలో ఇప్పటికే ఇద్దరు డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. కేసుల నమోదుకు గల కారణాలను తెలుసుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆహారం, తాగునీరు నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్ కు పంపించినట్లు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా రాజరాజేశ్వరి పేటలో కుళాయి నీటి సరఫరాను ఆపేసి తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఓ మధ్య వయస్కురాలు దీర్ఘకాల వ్యాధులతో ఆసుపత్రిలో మంగళవారం మరణించారని చెప్పారు. ఈ మరణం కేసుకు న్యూ రాజరాజేశ్వరిపేట డయేరియా ఘటనకు ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఎలాంటి మరణాలు నమోదు కాలేదని.. వదంతులు నమ్మవద్దని ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
Prajavartha Online Telugu News