-రూరల్ టాలెంట్ సెర్చ్ పేరుతో 82 రూరల్ నియోజకవర్గాల్లో కోచింగ్ క్యాంప్స్
-ఏసీఏ అధ్యక్షుడు,ఎంపీ కేశినేని శివనాథ్, సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు వెల్లడి
-ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభోత్సవం
-ప్రారంభించిన ఏసీఏ అధ్యక్షుడు,ఎంపీ కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్
-స్పోర్ట్స్ సెంటర్ గా మంగళగిరి క్రికెట్ స్టేడియం
-రాబోయే ఏపీఎల్ సీజన్ లో వైజాగ్, మంగళగిరి, మూలపాడు, కడప స్టేడియాల్లో మ్యాచులు
-అమరావతి సెకండ్ ఫేజ్ లో స్పోర్ట్స్ సీటి కి స్థలం ….మూడేళ్లలో స్టేడియం నిర్మాణం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్, మంగళగిరి, మూలపాడు, కడప క్రికెట్ స్టేడియాలను మ్యాచులు జరిగే విధంగా మౌలిక వసతుల కల్పనతో పాటు అభివృద్ది చేయటమే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన ధ్యేయమని…ఆ విధంగా ముందుసాగుతున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
పటమట, ఎన్టీఆర్ సర్కిల్, కృష్ణవేణి స్కూల్ రోడ్ లో నూతన నిర్మించిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం అత్యంత ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథి గా హాజరైన ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ ఏసీఏ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని సెక్రటరీ సానా సతీష్ బాబు తో కలిసి ప్రారంభించారు. అనంతరం సెక్రటరీ సానా సతీష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు, జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, ట్రెజరర్ దండమూడి శ్రీనివాసరావు , కౌన్సిలర్ దంతు గౌరు విష్ణు తేజ లతో పాటు కలిసి ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఏసీఏ కు వైజాగ్ లో గేమ్ డెవలప్ మెంట్ కార్యాలయం , విజయవాడలో అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వుంటుందని తెలిపారు. రెండు కార్యాలయాల ద్వారా ఏసీఏ కార్యకలాపాలు నిర్వహిస్తోందన్నారు.
ఈ ఏడాదిన్నర కాలంలో సెక్రటరీ సానా సతీష్ సహకారంతో బిసిసిఐ నుంచి రాష్ట్రంలో ఎప్పుడు రానీ విధంగా అంతర్జాతీయ మ్యాచులు రావటం జరిగిందన్నారు. గత పదేళ్ల కాలంలో వైజాగ్ కు ఎన్ని అంతర్జాతీయ మ్యాచులు జరిగాయో…దానికి రెండింతలు మ్యాచులు ఈ ఏడాదిన్నర కాలంలో తీసుకురావటం జరిగిందన్నారు.
ఏసీఏ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో క్రికెట్ గేమ్ డెవలప్ మెంట్ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముందుగా వైజాగ్ క్రికెట్ స్టేడియంలో డ్రెస్సింగ్ రూమ్, రెస్ట్ రూమ్స్, బాక్స్ లు ఆధునీకరణ చేయటం జరిగిందన్నారు. మీడియా బాక్స్ ఆధునీకరణ పనులు కూడా నెల రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. బి గ్రౌండ్ ను కూడా ఎ గ్రౌండ్ కు సమానంగా తయారు చేయటం జరిగిందని, వైజాగ్ స్టేడియంలో ప్రేక్షకులు కూర్చునే కుర్చీలు మార్చనున్నట్లు తెలిపారు. విశాఖ స్టేడియానికి అన్ని వసతులు కల్పించనున్నట్లు చెప్పారు.
గత ఏడాది వుమెన్స్ వరల్డ్ కప్ ప్రిపరేషన్ మ్యాచులు ఇరవై రోజుల పాటు విశాఖ స్టేడియంలో జరిగాయని, ఆ సమయంలో మంత్రి నారా లోకేష్ ఇండియా వుమెన్స్ తో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకుని వారిని ఉత్తేపర్చారు. మంత్రి నారా లోకేష్ ఎంకరేజ్ చేసిన ఇండియా టీమ్ విశ్వవిజేతగా నిలవటం ఎంతో ఆనందం కలిగించిందన్నారు.
ప్రపంచంలోనే ఎక్కడలేని విధంగా వైజాగ్ స్టేడియంలోనే ఇద్దరు మహిళల క్రికెటర్ల పేర్లు పెట్టడం జరిగిందని, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో వుమెన్ క్రికెట్ అకాడమీ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని స్పోర్ట్స్ సెంటర్ గా తయారు చేసేందుకు టెండర్లు పిలవటం జరిగిందన్నారు. ఈ స్పోర్ట్స్ సెంటర్ కింద 50 రూమ్స్ నిర్మించి మ్యాచులు జరిగే విధంగా ఆదునీకరించి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు.
బెంగుళూర్ లో బిసిసిఐ సెంట్రాఫ్ ఎక్సలెన్స్ ఏ విధంగా పెట్టిందో అదే విధంగా మూలపాడు స్టేడియం లో అకాడమీ ఫర్ క్రికెట్ ప్రారంభించబోతున్నట్లు వివరించారు. అక్కడ 50 రూమ్ లు నిర్మించి అక్కడే ప్లేయర్స్ శిక్షణ పొందే విధంగా స్టేడియాన్ని అభివృద్ది చేసేందుకు..టెండర్లు పిలవటం జరిగిందన్నారు.
కడప స్టేడియం లో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించటానికి కావాల్సిన రూమ్ లు లేవని, అందుకే మౌలిక వసతులు ఏర్పాటు అభివృద్ధి పనులు ప్రారంభించటం జరిగిందన్నారు. ప్రస్తుతం స్టేడియంలో 30 రూమ్ లు వుండగా, మరో
50 నుంచి 70 రూములు వచ్చే విధంగా స్టేడియాన్ని తయారు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఏపీఎల్ మ్యాచ్ లు వైజాగ్, మంగళగిరి, మూలపాడు, కడపలో నిర్వహించేందుకు స్టేడియాలను తయారు చేస్తున్నట్లు వివరించారు.
రూరల్ టాలెంట్ సెర్చ్
రాష్ట్రంలో రూరల్ ప్రాంతంలో వున్న ప్రతిభ గల క్రికెటర్స్ వెలుగులోకి తీసుకువచ్చేందుకు 82 రూరల్ నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన 82 నియోజకవర్గాల్లో ఈ క్యాంప్ నిర్వహించి బ్యాటర్స్, బౌలింగ్ , ఫీల్డర్స్ ను ఎంపిక చేయటం జరుగుతోందన్నారు. ఈ క్యాంప్ లో ఎంపికైన వారికి సమ్మర్ లో 3 నెలల పాటు కోచింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు.. రూరల్ ప్రాంతాల్లో వున్న ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని, రూరల్ అండ్ క్లీన్ క్రికెట్ పై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
క్రికెట్ తో పాటు ఇతర క్రీడలకు కూడా ఏసీఏ మద్దుతగా నిలుస్తుందన్నారు. అలాగే ప్రకృతి విపత్తు సమయాల్లో ప్రజలకు అండగా నిలబడుతోందని, విజయవాడ వరదల సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు సీఎం రిలీప్ ఫండ్ కింద కోటీ రూపాయాలు ఇవ్వటం జరిగిందన్నారు. అలాగే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో బాగా రాణించిన ఆంధ్ర క్రికెటర్లు నితీష్ రెడ్డి, శ్రీ చరణి లకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందించినట్లు తెలిపారు. ఇండియా వుమెన్స్ బ్లైండ్ క్రికెట్ టీమ్ కి రూ.15 లక్షలు అందించామన్నారు.
స్పోర్ట్స్ సిటీలోనే క్రికెట్ స్టేడియం వుండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన…ఆ విధంగా అమరావతి సెకండ్ ఫేజ్ లో స్పోర్ట్స్ సీటి కి స్థలం కేటాయింపు జరుగుతుందని, మూడేళ్లలో స్టేడియం నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు.
అనంతరం ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ మాట్లాడుతూ ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఏడాదిన్నర కాలంలో క్రికెట్ లో నూతన ఒరవడి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. క్రికెట్ ప్లేయర్స్ ను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో విదేశీ కోచ్ గ్యారీ స్టీడ్ ను నియమించటం జరిగిందన్నారు. ఇండియా లో మొదటిసారిగా ఏసీఏ మాత్రమే విదేశీ కోచ్ తో క్రికెట్ ప్లేయర్స్ శిక్షణ ఇప్పిస్తుందన్నారు. అలాగే మాజీ మహిళ క్రికెట్ కెప్టెన్ మిధాలి రాజ్ ఉమెన్ టీమ్ మెంటర్ గా నియమించటం జరిగిందని, వీళ్లు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో వుమెన్, మెన్స్ క్రికెట్ లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
రంజీ ట్రోపీలో ఆడిన అన్ని మ్యాచ్ లో ముందు వున్నట్లు తెలిపారు. ఇది హైయెస్ట్ సక్సెస్ రేట్…ముస్తాక్ అలీలో నెంబర్ త్రీ పోజిషన్ లో వుండగా, అండర్ 19 నాకౌట్ , వుమెన్స్ అండర్ 19 ఫైనల్స్ కి వెళ్ళినట్లు చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లు ఎన్ని వున్నా.. పారదర్శకత్వంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. అండర్ 14 విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ హంట్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అండర్ 14 సెలక్షన్స్ లో సెలెక్ట్ కానీ క్రికెట్ ప్లేయర్స్ కు, రూరల్ ప్రాంతాల్లో ప్రతిభ గల వాళ్లను గుర్తించి అవకాశం కల్పించేందుకు ఈ హంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News